
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలను పరిశీలిస్తే రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిందని ఎద్దేవా చేశారు.
2018 డిసెంబర్ 12వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందని నిందించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం ద్వారా లక్షలాదిమంది రైతుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని హరీశ్‌రావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.