
ఘట్‌కేసర్: రైతుల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అన్నదాతలపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎక్కడ చేశారని నిలదీసిన రైతుల్ని పట్టుకుని ‘మీరు రైతులా దున్నపోతులా’అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడికక్కడే సభలోనుంచి లేచి నిరసనకు దిగారు.
మంగళవారం పట్టణంలోని నారాయణగార్డెన్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన 2022–23 అర్థ వార్షిక నివేదిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనేవారని, నేడు పండుగ వాతావరణంలో సాగు చేస్తున్నారు.
ఈ క్రమంలో హరినాథ్‌రెడ్డి అనే రైతు రుణమాఫీ అవుతుందని తీసుకున్న రూ.80 వేలకు మరో 80 వేలు వడ్డీ అయిందని రుణమాఫీ ఎక్కడ చేశారని అడగగా మరో రైతు మహిపాల్‌రెడ్డి వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. దీంతో దున్నపోతుల్లా ఉన్నారు, మీరు రైతులా, బయటకు గుంజుకుపోండని మల్లారెడ్డి ఆదేశించడంతో రైతులు నిరసనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రైతుల్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.