harinath reddy
-
మీరు రైతులా! దున్నపోతులా!
ఘట్కేసర్: రైతుల సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అన్నదాతలపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎక్కడ చేశారని నిలదీసిన రైతుల్ని పట్టుకుని ‘మీరు రైతులా దున్నపోతులా’అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడికక్కడే సభలోనుంచి లేచి నిరసనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణగార్డెన్‌లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన 2022–23 అర్థ వార్షిక నివేదిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనేవారని, నేడు పండుగ వాతావరణంలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో హరినాథ్‌రెడ్డి అనే రైతు రుణమాఫీ అవుతుందని తీసుకున్న రూ.80 వేలకు మరో 80 వేలు వడ్డీ అయిందని రుణమాఫీ ఎక్కడ చేశారని అడగగా మరో రైతు మహిపాల్‌రెడ్డి వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. దీంతో దున్నపోతుల్లా ఉన్నారు, మీరు రైతులా, బయటకు గుంజుకుపోండని మల్లారెడ్డి ఆదేశించడంతో రైతులు నిరసనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. రైతుల్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
దాడి చేసింది మేనత్త కొడుకే
నెల్లూరు (క్రైమ్)/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం సాయంత్రం బాలికపై యాసిడ్ పోసి గొంతు కోసిన వ్యక్తి బాధితురాలి స్వయాన మేనత్త కొడుకేనని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథరెడ్డి వెల్లడించారు. దాడి అనంతరం ఇంట్లోని నగదును అపహరించుకుని వెళ్లాడన్నారు. వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. చెముడుగుంట నక్కలకాలనీలో నివాసముంటున్న దంపతుల కుమార్తె(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక మేనత్త కొడుకు నాగరాజు భార్య వినాయక చవితి వేడుకల కోసం కసుమూరులోని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు.. ఈనెల 5న బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. నాగరాజు మద్యం తాగొచ్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. భోజనం చేసేందుకు కూర కావాలని కోరాడు. బాలిక కూర ఇవ్వగా నిందితుడు దానిని తీసుకువెళ్లి భోజనం చేశాడు. అనంతరం కూర గిన్నెలో యాసిడ్ పోసుకుని మళ్లీ బాలిక దగ్గరకు వచ్చాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా ఆమె వెంటనే పారిపోయేందుకు యత్నించింది. ఇంతలో నిందితుడు యాసిడ్‌లో ఓ వస్త్రాన్ని ముంచి దానిని ఆమె ముఖంపై గట్టిగా అద్ది కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో బాలిక స్పృహ కోల్పోవడంతో మృతిచెందిందని భావించి బీరువా నుంచి రూ.4 వేలు, ఆమె చెవికున్న కమ్మలను తీసుకుని పరారయ్యాడు. స్పృహ నుంచి కోలుకున్న బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేసింది. వారు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్ కె.చక్రధర్‌బాబు, ఎస్పీ సీహెచ్ విజయారావు తదితరులు మెరుగైన వైద్యం కోసం బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలోకు తరలించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని.. పూర్తిగా దర్యాప్తుచేసి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. బాలిక త్వరగా కోలుకోవాలి : వాసిరెడ్డి పద్మ దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని, వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వెంకటాచలం: ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్భాస్కర్ను కోరాడు. దీంతో అతను గీతను సంప్రదించాడు. గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్ సిగ్నేచర్ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది. విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగా, గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
స్నేహితుడితో సహజీవనం.. సొంత కుమార్తెనే కిడ్నాప్ చేసిన తల్లి
నెల్లూరు (క్రైమ్): కన్నతల్లి తన స్నేహితుడితో కలసి కుమార్తెను కిడ్నాప్ చేసింది. రెండురోజుల వ్యవధిలోనే పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మస్తాన్‌కు దగదర్తి మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దంపతుల నడుమ విభేదాలు రావడంతో నాలుగేళ్ల కిందట విడిపోయారు. వీరు పిల్లల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పిల్లలను నానమ్మ కృష్ణవేణమ్మ వద్ద ఉంచాలని సూచించింది. నాగలక్ష్మి నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్తో సహజీవనం చేస్తోంది. ఇటీవల వారిద్దరూ విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ ప్రారంభించారు. ఈ క్రమంలో గత నెల 30వ తేది రాత్రి నాగలక్ష్మి, ఆమె స్నేహితుడు అల్తాఫ్ జొన్నవాడకు వచ్చారు. కృష్ణవేణమ్మ ఇంటికి కాస్త దూరంగా ఆటోను నిలిపి, ముఖానికి మాస్క్‌లు ధరించి నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. కృష్ణవేణమ్మను బెదిరించి, పెద్దకుమార్తెను నోరుమూసి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని విజయవాడకు వెళ్లిపోయారు. రాత్రి వేళ ముఖానికి మాస్కులు ధరించి ఉండడంతో వచ్చిందెవరన్నది కృష్ణవేణమ్మ గుర్తించలేకపోయింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ కోటేశ్వరరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసింది కన్నతల్లే అని గుర్తించారు. మంగళవారం విజయవాడకు చేరుకుని నాగలక్ష్మి, అల్తాఫ్ల చెర నుంచి బాలికను విడిపించి కృష్ణవేణమ్మకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
అవినీతిని సహించం..!
సాక్షి ప్రతినిధి, కడప : ఉపాధి హామీ పథకం జిల్లాకు వరం. నాలుగేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వలసలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజూ లక్ష పని దినాలు నమోదయ్యేలా క్షేత్ర సిబ్బంది ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ పథకం పరిధిలో ఏ స్థాయిలో కూడా అవినీతిని సహించేది లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎవ్వరిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ వై హరి హరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 270 కోట్లు ఖర్చు చేశామని ఇందులో సింహభాగం కూలీలకే చెల్లించామని ఆయన వివరించారు. జిల్లాలో ఉపాధి, వాటర్షెడ్ల పనుల నిర్వహణ, సిబ్బంది పనితీరు..అక్రమాలు.. వంటి వాటిపై ‘సాక్షి’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి కూలీకి పనికల్పిస్తాం.. ప్రతి కూలీకి పని కల్పించడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. కూలీలు అడిగినా పనులు కల్పించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాం. ఇప్పుడిప్పుడు పని దినాల సంఖ్య పెరుగుతోంది. రోజూ 80 వేల మంది దాకా కూలీలు పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకుపైగా పెంచాలనేది లక్ష్యం. రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పని దినాల సంఖ్య లక్షకుపైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1.30 కోట్ల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ∙రూ.270 కోట్లు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల నమోదు లక్ష్యం 1.39 కోట్లు. ఇప్పటికే 1.08 కోట్ల పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన పని దినాలను మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.330 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి దాకా రూ.270 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో కూలీలకే రూ.157 కోట్లు చెల్లించాం. సామగ్రి కొనుగోలు కింద మరో రూ.87 కోట్లు వ్యయం చేశాం. వేతనాలకు రూ.18 కోట్లు వెచ్చించాం. ∙బాధ్యతతో పనిచేయాలి.. క్లస్టర్లో సహాయ పీడీలు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. కేవలం సిబ్బందిపై కర్ర పెత్తనం చేస్తామంటే కుదరదు. సమష్టిగా పని చేస్తేనే ఫలితాలు సాధ్యం. ఇదే విషయాన్ని ప్రతి వారం సమీక్షల్లో చెబుతున్నాం. రూ.2.36 కోట్ల అవినీతి జరిగింది.. పదమూడేళ్ల కిందట ఈ పథకం మొదలైంది. మొత్తం 12 విడతల సామాజిక తనిఖీలు జరిగాయి. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో దాదాపు రూ.9.84 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో రూ.4.86 కోట్లు విచారణ తర్వాత రద్దు చేశాం. మరో రూ.2.36 కోట్ల మేర వసూలు చేశాం. ఆర్ఆర్ చట్టం కింద రూ.1.53 కోట్లు, మిగిలిన రూ.96 లక్షలు వేతనాల రికవరీ కింద వసూలు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు.. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో ఏస్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఏ స్థాయిలో అవినీతిని సహించేది లేదు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే.. నేరుగా నాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పీఓలపై పని ఒత్తిడి ఉన్నది వాస్తవమే.. ఉపాధి హామీ పథకంలో ఎంపీడీఓలే పీఓలుగా పనిచేస్తున్నారు. వీరు సరిగా పనిచేయలేదన్నది వాస్తవం కాదు. నేను వచ్చిన తర్వాత తరచూ వారితో మాట్లాడుతున్నా.. మండల కంప్యూటర్ కేంద్రాల్లో ఎంపీడీఓలు ఉండి ప్రతి లావాదేవీని వారే చేస్తున్నారు. అయితే వారు ఇతర పనుల పట్ల దృష్టి సారించడంతో పని ఒత్తిడి ఉన్న మాట వాస్తమే. అలాగని వారు ఉపాధి పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు. -
డీఎస్పీ హరినాథ్‌రెడ్డికి షాక్..!
సాక్షి, కర్నూలు: సీఐడీ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు జరిపింది. శనివారం తెల్లవారుజాము నుంచి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరులోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు మొత్తం తొమ్మిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్‌రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సీఐడీ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దమొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో ఇప్పటివరకు రూ. 7 లక్షల నగదు, డాక్యుమెంట్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం. అనంతపురం జిల్లా డబూరువారిపల్లిలో హరినాథ్‌రెడ్డి తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంట్లో కూడా సోదాలు చేపడుతున్నారు. సోదరుడు రాజేశ్వరరెడ్డి, బావమరిది జగన్మోహన్రెడ్డితో పాటు స్నేహితులు నాగ రాజారెడ్డి, ఈశ్వరయ్య ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కర్నూలులోని తుగ్గలి మండలం, పగిడిరాయిలోని డీఎస్పీ బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరుజిల్లా వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుమారుడు టి.హరినాథ రెడ్డి(36) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. భార్యతో కలిసి రెండు రోజుల క్రితం పత్తేపురం వచ్చాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో గడిపాడు. సోమవారం తెల్లవారుజామున తన బావమరిది ఓబుల్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై బెంగళూరు బయలుదేరాడు. ఆంధ్రా సరిహద్దులోని కర్ణాటకలోని రాయల్పాడు వద్ద ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న హరినాథరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఓబుల్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలపడంతో సీటీఎం రోడ్డులోని చంద్రమోహన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి
కౌడిపల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గంగారంలో చోటుచేసుకుంది. బాధితుడు హరినాథ్‌రెడ్డి, అతని తల్లి విజయ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ముజాహిద్ హుస్సెన్, గ్రామస్తుల కథనం ప్రకారం... గంగారం గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు, ఎత్తిపోతల పథకం సాగునీరు, పింఛన్లు ఇక నుండి బంద్ చేస్తామని, ఆదివారం గ్రామస్తులంతా గ్రామ చావిడివద్దకు రావాలని చాటింపు వేయించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్థులందరు గ్రామచావిడివద్దకు వచ్చారు. పనులు, సాగునీరు ఎందుకు బంద్చేస్తారని గ్రామస్థులతోపాటు హరినాథ్‌రెడ్డి ప్రశ్నించాడు. ఇదేవిషయంపై గ్రామస్థుడు శంకర్ మాట్లాడుతూ తమకు కొన్ని నెలలుగా ఉపాధి హామీ కూలి డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిలదీయగా అతనికి హరినాథ్‌రెడ్డి మద్దతు పలికాడు. దీంతో అడిగేందుకు మీరెవరంటు ఫీల్డ్అసిస్టెంట్ దూషించగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్థుల సమక్షంలోనే హరినాథ్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు చేశారు. అయితే కేసు ఇంకా నమోదు కాలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఎన్నికల్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్టువేయలేదన్న కక్షతోనే గ్రామంలో పనులు బంద్చేయస్తామని చాటింపు వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనులు బంద్ చేస్తామంటు చాటింపుచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితుడి తల్లి కోరింది. -
‘సాఫ్ట్’ టు ‘ఫైర్’
ఇంజినీరింగ్ చదివిన ఆ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా తృప్తి చెందలేదు. ఏదో సాధించాలనే తపన ఆయనను నిత్యం వెంటాడేది. ప్రజలకు సేవచేసే భాగ్యం సివిల్స్ ద్వారానే సాధ్యమవుతుందని భావించారు. ఆ దిశగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినా వెనుకంజ వేయలేదు. గ్రూప్-1పై దృష్టిసారించి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆయనే.. జిల్లాకు నూతనంగా వచ్చిన ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి. సాక్షి, నల్లగొండ: కడప జిల్లా దువ్వూరు మండలం పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన హరినాథ్‌రెడ్డిది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచంద్రారెడ్డి ఓ సిమెంట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మ గృహిణి. అన్నకు అమెరికాలో ఉద్యోగం. అయితే సిమెంట్ కంపెనీ ఉన్న ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో 1983లో స్థిరపడ్డారు. కంపెనీకి చెందిన పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నాడు. ఇం టర్ విజయవాడలో అభ్యసించాడు. ఆ తర్వాత పాండిచ్చేరి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి మెకానికల్ విభాగంలో చేరాడు. ఇక్కడే మలుపు... చిన్నప్పటి నుంచే హరినాథ్‌రెడ్డిది భిన్నమైన మనస్తత్వం. ఎదుటి వారు చెప్పింది కాకుండా తన ఆలోచనలకు అధిక ప్రాధాన్యమిస్తాడు. తన వల్ల నలుగురికి సాయం అందాలన్న గొప్ప లక్షణాన్ని ఒంట బట్టించుకున్నాడు. ఇంజినీరింగ్ కళాశాల కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండడంతో తరచు అక్కడికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వచ్చి వెళ్తుండేవారు. ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా అతిథులుగా వీరు హాజరయ్యేవారు. వీరి రాకపోకల వల్ల అందరిలో చర్చ జరిగేది. ప్రజలకు సేవ చేసే భాగ్యం.. సివిల్ సర్వీసెస్‌లో అధికంగా ఉందని తెలుసుకున్నాడు. తన ఆలోచన విధానానికి, నలుగురికి మేలు చేయాలన్న తన మనస్తత్వానికి సివిల్సే సరైన వేదిక అని నిశ్చయించుకున్నాడు. ఇంజినీరింగ్మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్ ద్వారా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరకుండా సివిల్స్ వైపే మొగ్గు చూపాడు. గ్రూప్-1కు ఎంపిక జపాన్ వెళ్లి ఎంబీఏ చే యడానికి సన్నద్ధమయ్యాడు. ఓ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే సీటు లభించింది. జపాన్ వెళ్లే ముందు 2009లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. మొదట ప్రిలిమ్స్ రాశాడు. కొన్ని రోజులకే ఫలితాలు వెలువడ్డాయి. మెయిన్స్‌కు అర్హత సాధించాడు. అప్పటికే సివిల్స్‌కు ప్రిపేర్ కావడంతో మెయిన్స్‌లోనూ నెగ్గడం సులువైంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో నెగ్గుతానన్న కొండంత ధైర్యం ఆయనలో నిండుకుంది. ఇంటర్వ్యూ ఎదుర్కొన్న రోజే జపాన్‌కు బయలుదేరాడు. కొంతకాలం గడవగానే ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యాడన్న తీపి కబురందింది. రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవలకు ఎంపికయ్యాడు. దీంతో తన ఆనందానికి హద్దులులేవు. ఆతర్వాత ఎంబీఏ కూడా పూర్తయ్యింది. అక్కడ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. స్వస్థలానికి వచ్చి హైదరాబాద్‌లో ఏడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఇటీవల జిల్లాకు ఫైర్ ఆఫీసర్‌గా వచ్చి విధుల్లో చేరారు.