ఇంజినీరింగ్ చదివిన ఆ యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా తృప్తి చెందలేదు. ఏదో సాధించాలనే తపన ఆయనను నిత్యం వెంటాడేది. ప్రజలకు సేవచేసే భాగ్యం సివిల్స్ ద్వారానే సాధ్యమవుతుందని భావించారు. ఆ దిశగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినా వెనుకంజ వేయలేదు. గ్రూప్-1పై దృష్టిసారించి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆయనే.. జిల్లాకు నూతనంగా వచ్చిన ఫైర్ ఆఫీసర్ హరినాథ్‌రెడ్డి.
సాక్షి, నల్లగొండ: కడప జిల్లా దువ్వూరు మండలం పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన హరినాథ్‌రెడ్డిది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచంద్రారెడ్డి ఓ సిమెంట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మ గృహిణి. అన్నకు అమెరికాలో ఉద్యోగం. అయితే సిమెంట్ కంపెనీ ఉన్న ఎర్రగుంట్ల మండలం చిలమకూరులో 1983లో స్థిరపడ్డారు. కంపెనీకి చెందిన పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నాడు. ఇం టర్ విజయవాడలో అభ్యసించాడు. ఆ తర్వాత పాండిచ్చేరి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి మెకానికల్ విభాగంలో చేరాడు.
ఇక్కడే మలుపు...
చిన్నప్పటి నుంచే హరినాథ్‌రెడ్డిది భిన్నమైన మనస్తత్వం. ఎదుటి వారు చెప్పింది కాకుండా తన ఆలోచనలకు అధిక ప్రాధాన్యమిస్తాడు. తన వల్ల నలుగురికి సాయం అందాలన్న గొప్ప లక్షణాన్ని ఒంట బట్టించుకున్నాడు. ఇంజినీరింగ్ కళాశాల కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండడంతో తరచు అక్కడికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వచ్చి వెళ్తుండేవారు. ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా అతిథులుగా వీరు హాజరయ్యేవారు. వీరి రాకపోకల వల్ల అందరిలో చర్చ జరిగేది. ప్రజలకు సేవ చేసే భాగ్యం.. సివిల్ సర్వీసెస్‌లో అధికంగా ఉందని తెలుసుకున్నాడు. తన ఆలోచన విధానానికి, నలుగురికి మేలు చేయాలన్న తన మనస్తత్వానికి సివిల్సే సరైన వేదిక అని నిశ్చయించుకున్నాడు. ఇంజినీరింగ్‌మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్ ద్వారా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరకుండా సివిల్స్ వైపే మొగ్గు చూపాడు.
గ్రూప్-1కు ఎంపిక
జపాన్ వెళ్లి ఎంబీఏ చే యడానికి సన్నద్ధమయ్యాడు. ఓ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే సీటు లభించింది. జపాన్ వెళ్లే ముందు 2009లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. మొదట ప్రిలిమ్స్ రాశాడు. కొన్ని రోజులకే ఫలితాలు వెలువడ్డాయి. మెయిన్స్‌కు అర్హత సాధించాడు. అప్పటికే సివిల్స్‌కు ప్రిపేర్ కావడంతో మెయిన్స్‌లోనూ నెగ్గడం సులువైంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో నెగ్గుతానన్న కొండంత ధైర్యం ఆయనలో నిండుకుంది.
ఇంటర్వ్యూ ఎదుర్కొన్న రోజే జపాన్‌కు బయలుదేరాడు. కొంతకాలం గడవగానే ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యాడన్న తీపి కబురందింది. రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవలకు ఎంపికయ్యాడు. దీంతో తన ఆనందానికి హద్దులులేవు. ఆతర్వాత ఎంబీఏ కూడా పూర్తయ్యింది. అక్కడ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. స్వస్థలానికి వచ్చి హైదరాబాద్‌లో ఏడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఇటీవల జిల్లాకు ఫైర్ ఆఫీసర్‌గా వచ్చి విధుల్లో చేరారు.
‘సాఫ్ట్’ టు ‘ఫైర్’
Published Mon, Oct 21 2013 2:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement