వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ హరినాథరెడ్డి
నెల్లూరు (క్రైమ్): కన్నతల్లి తన స్నేహితుడితో కలసి కుమార్తెను కిడ్నాప్ చేసింది. రెండురోజుల వ్యవధిలోనే పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మస్తాన్‌కు దగదర్తి మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దంపతుల నడుమ విభేదాలు రావడంతో నాలుగేళ్ల కిందట విడిపోయారు. వీరు పిల్లల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పిల్లలను నానమ్మ కృష్ణవేణమ్మ వద్ద ఉంచాలని సూచించింది.
నాగలక్ష్మి నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్‌తో సహజీవనం చేస్తోంది. ఇటీవల వారిద్దరూ విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ ప్రారంభించారు. ఈ క్రమంలో గత నెల 30వ తేది రాత్రి నాగలక్ష్మి, ఆమె స్నేహితుడు అల్తాఫ్ జొన్నవాడకు వచ్చారు. కృష్ణవేణమ్మ ఇంటికి కాస్త దూరంగా ఆటోను నిలిపి, ముఖానికి మాస్క్‌లు ధరించి నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. కృష్ణవేణమ్మను బెదిరించి, పెద్దకుమార్తెను నోరుమూసి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని విజయవాడకు వెళ్లిపోయారు. రాత్రి వేళ ముఖానికి మాస్కులు ధరించి ఉండడంతో వచ్చిందెవరన్నది కృష్ణవేణమ్మ గుర్తించలేకపోయింది.
అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ కోటేశ్వరరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసింది కన్నతల్లే అని గుర్తించారు. మంగళవారం విజయవాడకు చేరుకుని నాగలక్ష్మి, అల్తాఫ్‌ల చెర నుంచి బాలికను విడిపించి కృష్ణవేణమ్మకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment