kidnapped girl
-
Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం.. ఆరు గంటల్లోనే సుఖాంతం
సనత్‌నగర్ (హైదరాబాద్): మహంకాళీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ అయిన ఆరేళ్ల చిన్నారి ఆచూకీని పోలీసులు ఆరు గంటల్లో కనిపెట్టారు. పాపను హైదరాబాద్ దాటించేసినప్పటికీ పోలీసులు అప్రమత్తమై సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ కదలికలను తెలుసుకుంటూ చివరకు సిద్దిపేటలో పట్టుకున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ కిందిబస్తీకి చెందిన రేణుక అనే మహిళ విక్టోరియాగంజ్ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు కుమారుడు ముకుంద్ (7), కుమార్తె (6) కృతిక ఉన్నారు. సికింద్రాబాద్ సెయింట్ ఆంటోనీస్ బాలికల పాఠశాలలో కృతిక ఒకటో తరగతి చదువుతోంది. తండ్రి నర్సింగరావు రోజూ పాపను స్కూల్ వద్ద దించి వెళ్తుంటాడు. స్కూల్ సమయం ముగిశాక పాప ఓల్డ్ బోయిగూడ అంజయ్య కాంప్లెక్స్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. రేణుక విధులను ముగించుకుని ఇంటికి వెళ్తూ పాపను తీసుకువెళ్తుంటుంది. శుక్రవారం స్కూల్‌కు సెలవు కావడంతో కృతికను తన తల్లి వద్ద వదిలి పనికివెళ్లింది. అయితే ఉదయం 11 గంటల సమయంలో పాప కనిపించడం లేదని రేణుక సోదరుడు ఆమెకు ఫోన్‌చేసి చెప్పాడు. పాప ఆచూకీ కోసం వెతికే క్రమంలో అక్కడి మెస్ నిర్వాహకులను ఆరా తీయగా మెస్‌లో పనిచేసేందుకు రోజువారీ కూలీ వచ్చాడని, అతను కూడా కనిపించడం లేదని చెప్పారు. దీంతో అతడిపై అనుమానంతో రేణుక మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు 10 బృందాలను ఏర్పాటుచేసి గాలింపు ప్రారంభించారు. మెస్ వద్ద నుంచి మొదలుపెట్టి దాదాపు 70 వరకు సీసీ కెమెరాలను పరిశీలించి పాపను సిద్దిపేటలో గుర్తించారు. కిడ్నాపర్‌ను సిద్దిపేట ప్రాంతానికి చెందిన రాముగా పోలీ సులు గుర్తించారు. అయితే రాము ఒక సైకో అని పోలీసులు తెలిపారు. పోలీసులు పాప ఆచూకీని కనిపెట్టి, తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. -
బాలిక అదృశ్యం కేసు విషాదాంతం
లక్నో: అదృశ్యమైన ఆరేళ్ల బాలిక కేసు విషాదాంతంగా ముగిసింది. రెండు రోజుల క్రితం తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల బాలిక ట్రంక్ బాక్సులో శవమై కన్పించింది. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హపూర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక గురువారం (డిసెంబరు 2)న సాయంత్రం ఇంటి నుంచి చాక్లెట్ కొనుక్కుంటానని బయటకు వెళ్లింది. ఆ తర్వాత.. ఎంత సేపటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తండ్రి ఆరోజు రాత్రంతా బాలిక కోసం వెతికారు. అయినా.. బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయాన్నే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇంటి తాళలను పగులగొట్టారు. అప్పుడు వారికి ఒక ట్రంక్ పెట్టెలో బట్టలు, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత.. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాలికను ఆ ఇంటి యజమాని బైక్ మీద కూర్చోబెట్టుకుని, అతని ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.కాగా, చాక్లెట్ కొనడానికి వెళ్లిన కూతురు.. రెండు రోజుల తర్వాత శవమై కనిపించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యింది. దీంతో స్థానికులు ఆ నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి పాల్పడ్డారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రిపోర్టులు వచ్చాక.. పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుడితో సహజీవనం.. సొంత కుమార్తెనే కిడ్నాప్ చేసిన తల్లి
నెల్లూరు (క్రైమ్): కన్నతల్లి తన స్నేహితుడితో కలసి కుమార్తెను కిడ్నాప్ చేసింది. రెండురోజుల వ్యవధిలోనే పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మస్తాన్‌కు దగదర్తి మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దంపతుల నడుమ విభేదాలు రావడంతో నాలుగేళ్ల కిందట విడిపోయారు. వీరు పిల్లల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పిల్లలను నానమ్మ కృష్ణవేణమ్మ వద్ద ఉంచాలని సూచించింది. నాగలక్ష్మి నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్తో సహజీవనం చేస్తోంది. ఇటీవల వారిద్దరూ విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ ప్రారంభించారు. ఈ క్రమంలో గత నెల 30వ తేది రాత్రి నాగలక్ష్మి, ఆమె స్నేహితుడు అల్తాఫ్ జొన్నవాడకు వచ్చారు. కృష్ణవేణమ్మ ఇంటికి కాస్త దూరంగా ఆటోను నిలిపి, ముఖానికి మాస్క్‌లు ధరించి నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. కృష్ణవేణమ్మను బెదిరించి, పెద్దకుమార్తెను నోరుమూసి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని విజయవాడకు వెళ్లిపోయారు. రాత్రి వేళ ముఖానికి మాస్కులు ధరించి ఉండడంతో వచ్చిందెవరన్నది కృష్ణవేణమ్మ గుర్తించలేకపోయింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ కోటేశ్వరరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసింది కన్నతల్లే అని గుర్తించారు. మంగళవారం విజయవాడకు చేరుకుని నాగలక్ష్మి, అల్తాఫ్ల చెర నుంచి బాలికను విడిపించి కృష్ణవేణమ్మకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం
వెంకటాచలం (నెల్లూరు): ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఈదగాలిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక బంధువుల సమాచారం మేరకు.. ఈదగాలి ఎస్టీ కాలనీకి చెందిన చందు అనే యువకుడు సర్వేపల్లిలోని ఎస్ఎన్జీ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈదగాలి దళితవాడకు చెందిన బాలిక అదే బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరి గింది. అయితే సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన బాలిక మధ్యాహ్నం ఇంటికి చేరుకోకపోవడంతో బాలిక తల్లిదండ్రులు బంధువుల గ్రామాల్లో విచారించిన ఆచూకీ తెలియలేదు. అయి తే బుధవారం ఉదయం ఈదగాలి పొలాల సమీపంలో బాలిక గాయాలతో పడి ఉండటంతో గ్రామస్తులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. చందు తనపై లైంగికంగా దాడి చేసి గాయ పరి చాడని బాలిక చెప్పడంతో వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కిడ్నాప్ అయిన పురిటిబిడ్డ క్షేమం
తిరుపతి (చిత్తూరు): చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 20న మాయమైన పురిటిబిడ్డ పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షమైంది. చంద్రగిరి మండలం మరవపల్లికి చెందిన మునిరాజు భార్య సోనియా డెలివరీ కోసం తిరుపతి ఆసుపత్రిలో చేరింది. బిడ్డ ప్రసవించిన కొద్దిసేపటి తర్వాత నర్సు వేషంలో వచ్చిన ఒకామె పురిటిబిడ్డను ఎత్తుకు పోయింది. ఈ విషయం గురించి బిడ్డ తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బురఖా వేసుకొచ్చిన ఒకామె బిడ్డను పీలేరు ప్రభుత్వాసుపత్రిలో విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. బిడ్డ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని పీలేరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సహదేవయ్య తెలిపారు.