సీసీ ఫుటేజీలో పాపను తీసుకువెళ్తున్న నిందితుడు రాము
సనత్‌నగర్ (హైదరాబాద్): మహంకాళీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ అయిన ఆరేళ్ల చిన్నారి ఆచూకీని పోలీసులు ఆరు గంటల్లో కనిపెట్టారు. పాపను హైదరాబాద్ దాటించేసినప్పటికీ పోలీసులు అప్రమత్తమై సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ కదలికలను తెలుసుకుంటూ చివరకు సిద్దిపేటలో పట్టుకున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ కిందిబస్తీకి చెందిన రేణుక అనే మహిళ విక్టోరియాగంజ్ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ఉద్యోగం చేస్తోంది.
ఆమెకు కుమారుడు ముకుంద్ (7), కుమార్తె (6) కృతిక ఉన్నారు. సికింద్రాబాద్ సెయింట్ ఆంటోనీస్ బాలికల పాఠశాలలో కృతిక ఒకటో తరగతి చదువుతోంది. తండ్రి నర్సింగరావు రోజూ పాపను స్కూల్ వద్ద దించి వెళ్తుంటాడు. స్కూల్ సమయం ముగిశాక పాప ఓల్డ్ బోయిగూడ అంజయ్య కాంప్లెక్స్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. రేణుక విధులను ముగించుకుని ఇంటికి వెళ్తూ పాపను తీసుకువెళ్తుంటుంది.
శుక్రవారం స్కూల్‌కు సెలవు కావడంతో కృతికను తన తల్లి వద్ద వదిలి పనికివెళ్లింది. అయితే ఉదయం 11 గంటల సమయంలో పాప కనిపించడం లేదని రేణుక సోదరుడు ఆమెకు ఫోన్‌చేసి చెప్పాడు. పాప ఆచూకీ కోసం వెతికే క్రమంలో అక్కడి మెస్ నిర్వాహకులను ఆరా తీయగా మెస్‌లో పనిచేసేందుకు రోజువారీ కూలీ వచ్చాడని, అతను కూడా కనిపించడం లేదని చెప్పారు.
దీంతో అతడిపై అనుమానంతో రేణుక మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు 10 బృందాలను ఏర్పాటుచేసి గాలింపు ప్రారంభించారు. మెస్ వద్ద నుంచి మొదలుపెట్టి దాదాపు 70 వరకు సీసీ కెమెరాలను పరిశీలించి పాపను సిద్దిపేటలో గుర్తించారు. కిడ్నాపర్‌ను సిద్దిపేట ప్రాంతానికి చెందిన రాముగా పోలీ సులు గుర్తించారు. అయితే రాము ఒక సైకో అని పోలీసులు తెలిపారు. పోలీసులు పాప ఆచూకీని కనిపెట్టి, తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment