Mahankali Police Station
-
Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం.. ఆరు గంటల్లోనే సుఖాంతం
సనత్‌నగర్ (హైదరాబాద్): మహంకాళీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ అయిన ఆరేళ్ల చిన్నారి ఆచూకీని పోలీసులు ఆరు గంటల్లో కనిపెట్టారు. పాపను హైదరాబాద్ దాటించేసినప్పటికీ పోలీసులు అప్రమత్తమై సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ కదలికలను తెలుసుకుంటూ చివరకు సిద్దిపేటలో పట్టుకున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ కిందిబస్తీకి చెందిన రేణుక అనే మహిళ విక్టోరియాగంజ్ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు కుమారుడు ముకుంద్ (7), కుమార్తె (6) కృతిక ఉన్నారు. సికింద్రాబాద్ సెయింట్ ఆంటోనీస్ బాలికల పాఠశాలలో కృతిక ఒకటో తరగతి చదువుతోంది. తండ్రి నర్సింగరావు రోజూ పాపను స్కూల్ వద్ద దించి వెళ్తుంటాడు. స్కూల్ సమయం ముగిశాక పాప ఓల్డ్ బోయిగూడ అంజయ్య కాంప్లెక్స్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. రేణుక విధులను ముగించుకుని ఇంటికి వెళ్తూ పాపను తీసుకువెళ్తుంటుంది. శుక్రవారం స్కూల్‌కు సెలవు కావడంతో కృతికను తన తల్లి వద్ద వదిలి పనికివెళ్లింది. అయితే ఉదయం 11 గంటల సమయంలో పాప కనిపించడం లేదని రేణుక సోదరుడు ఆమెకు ఫోన్‌చేసి చెప్పాడు. పాప ఆచూకీ కోసం వెతికే క్రమంలో అక్కడి మెస్ నిర్వాహకులను ఆరా తీయగా మెస్‌లో పనిచేసేందుకు రోజువారీ కూలీ వచ్చాడని, అతను కూడా కనిపించడం లేదని చెప్పారు. దీంతో అతడిపై అనుమానంతో రేణుక మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు 10 బృందాలను ఏర్పాటుచేసి గాలింపు ప్రారంభించారు. మెస్ వద్ద నుంచి మొదలుపెట్టి దాదాపు 70 వరకు సీసీ కెమెరాలను పరిశీలించి పాపను సిద్దిపేటలో గుర్తించారు. కిడ్నాపర్‌ను సిద్దిపేట ప్రాంతానికి చెందిన రాముగా పోలీ సులు గుర్తించారు. అయితే రాము ఒక సైకో అని పోలీసులు తెలిపారు. పోలీసులు పాప ఆచూకీని కనిపెట్టి, తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. -
డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్.. కొట్టింది నిజమేనన్న ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కానిస్టేబుల్ లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన మేరకు.. పార్శీగుట్టకు చెందిన రాజు (42) రాణిగంజ్‌లోని లారీ అడ్డాలో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే వాహనాన్ని నిలుపుకుని ఉంటాడు. ఈనెల 21న రాణిగంజ్‌లోని ఆలయం వద్ద పడుకున్నాడు. అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆయనను బూటుకాలితో తన్ని లేపాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ లాఠీతో తీవ్రంగా కొట్టాడు. గురువారం ఉదయం రాజును కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకు వెళ్లినా చేర్చుకోలేదు. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు రాగా.. కొట్టడం తప్పేకానీ తామే చికిత్స చేయిస్తామని పోలీసు అధికారులు చెప్పడంతో చేసేది ఏమి లేక వారు ఒప్పుకున్నారు. పోలీసులే పద్మారావునగర్‌లోని పల్స్ ఆస్పత్రికి తీసుకెవెళ్లి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి చికిత్సకు ఒప్పించారు. అటు తర్వాత విషయం మీడియాకు తెలియడంతో బయటకు పొక్కింది. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడని, వారు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
-
గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మధు (31) చేతిలోని ఎస్ఎల్ఆర్ గన్ పేలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 2010లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎన్నికైన సూర్యాపేట నేరేడుచర్ల మండలం బత్తులపాలెం గ్రామనికి చెందిన ఎ.మధు అంబర్‌పేట్‌లోని న్యూప్రేమ్‌నగర్‌లో భార్య నాగమణి, కుమార్తె రిషిక సాయి, కుమారుడు రిశాంక్ సాయిలతో కలిసి ఉంటున్నాడు. రాణిగంజ్ హైదర్‌బస్తీలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెన్సీ చెస్ట్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల నుంచి కరెన్సీని ఇక్కడికి తీసుకుని రావడం, ఇక్కడి నుంచి అవసరం ఉన్న చోటకు నగదును తరలిస్తుంటారు. యథావిధిగా ఆదివారం ఉదయం మధు సెంట్రీ డ్యూటీలో చేరాడు. కొద్దిసేపటికి గన్ పేలిన శబ్దం వచ్చింది. తోటి సిబ్బంది, అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు అక్కడికి వచ్చి చూడగా చేతిలో ఎస్ఎల్ఆర్ గన్ (7.62 ఎంఎం)తో రక్తపు మడుగులో మధు పడివున్నాడు. అతన్ని పరిశీ లించగా తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మరణించాడు. మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, క్లూస్ టీమ్‌తోపాటు ఎస్పీఎఫ్ డీజీ గోపాలకృష్ణ కూడా అక్కడికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తూటా అతడి గడ్డం కింది నుంచి నేరుగా తల పైభాగం మీదుగా బయటకు వచ్చి పైన బిల్డింగ్ స్లాబుకు తలిగింది. బుల్లెట్ తగిలిన విధానం చూస్తే మిస్‌ఫైర్ అయినట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం లేదా, అధికారుల వేధింపులతో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. -
లోక్ అదాలత్‌లో కేసు కాంప్రమైజ్
సాక్షి, సిటీబ్యూరో: సిటీ పోలీసింగ్ పనితీరుపై ఓ మచ్చ ఈ కేసు.. తీవ్రమైన నేరంగా పరిగణించే దోపిడీ కేసులో పోలీసులు ‘రాజీ’పడ్డారు.. ప్రధాన సూత్రధారిని పట్టుకోలేకయిన బృందాలు అతడి ‘ఆఫర్’కు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.. కేసు రాజీ కావడంతో దోచుకుపోయిన డబ్బు తిరిగి ఇచ్చాడని తెలిసింది. ఫలితంగా మహంకాళి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న రూ.30 లక్షల దోపిడీ కేసు 60 రోజుల్లోపే ‘తేలిపోయింది’. ఈ అధికారుల తీరుపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేరం జరిగింది మినహాయిస్తే ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేయడం, వీరిలో ఒకరిని హయత్‌నగర్ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకోవడం, కేసు రాజీ కావడం.. ఇవన్నీ అత్యంత రహస్యంగా జరగడం గమనార్హం. అసలేం జరిగింది? సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్లో శ్రీనివాసవర్మ అనే వ్యక్తి రోహిత్ జ్యువెలర్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. బంగారు నగలను ఆర్డర్‌పై తయారు చేసి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఈ దుకాణానికి ఎదురుగానే అనిల్ అనే వ్యాపారి నవ్కార్ జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. అనిల్ నుంచి శ్రీనివాసవర్మకు నగల తయారీకి సంబంధించి కొంత మొత్తం రావాల్సి ఉంది. దీంతోపాటు మరికొంత బదులు ఇవ్వాల్సిందిగా శ్రీనివాసవర్మ కోరారు. గత ఏడాది నవంబర్ 12 రాత్రి ఈ నగదు సిద్ధం చేసిన అనిల్.. వర్మకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడి వద్ద పని చేసే రూపారామ్ అనే రాజస్థానీ డబ్బు తీసుకురావడానికి వెళ్లాడు. అనిల్ నుంచి రూ.30 లక్షలు తీసుకున్న రూపారామ్ మొదటి అంతస్తు నుంచి కిందికి వస్తుండగా మెట్లపైకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అతడి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి డబ్బు బ్యాగ్ దోచుకున్నాడు. అప్పటికే కింద ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరొకరితో కలిసి పారిపోయాడు. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఈ దోపిడీకి సంబంధించి శ్రీనివాసవర్మ ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసుస్టేషన్లో అదే రోజు రాత్రి కేసు (ఎఫ్ఐఆర్ నెం.217/2019) నమోదైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా నిందితులు సమీపంలో ఉన్న ఓ బేకరీ గల్లీ నుంచి బయటకు వచ్చి దాదాపు అర్ధగంట పాటు ఆ పరిసరాల్లోనే తచ్చాడినట్లు గుర్తించారు. ఆపై మహంకాళి దేవాలయం ముందు నుంచి నవ్కార్ జ్యువెలర్స్ వద్దకు వచ్చినట్లు కనిపించింది. ఒకరు వాహనంపైనే ఉండగా.. మరొకరు వచ్చి డబ్బు దోచుకుపోయినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రూపారామ్ పాత్రను పోలీసులు అనుమానించారు. నేరగాడు నేరుగా డబ్బు బ్యాగ్‌తో వస్తున్న అతడి వద్దకే వెళ్లడం.. కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి నగదు సంచీ లాక్కుంటున్న ఇతడు అరవకపోవడం తదితర కారణాలతో ఈ కోణంపై దృష్టి పెట్టిన పోలీసులు రూపారామ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సమాచారంతోనే దోపిడీ.. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నాళ్లుగా శ్రీనివాసవర్మ వద్ద పని చేస్తున్న రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాకు చెందిన రూపారామ్‌కు అతడి ఆర్థిక లావాదేవీలు తెలిశాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్త దోచుకుని పరారవ్వాలని నిర్ణయించుకున్న అతగాడు ఈ విషయాన్ని తమ ప్రాంతానికే చెందిన సన్నిహితుడు భజన్‌లాల్‌కు చెప్పాడు. అంగీకరించిన అతడు మంగీలాల్‌ను తీసుకుని నరానికి చేరుకున్నాడు. ఇద్దరూ బండ్లగూడలో ఉంటున్న కొందరు రాజస్థానీలతో కలిసి కొన్నాళ్లు నివసించి రూపారామ్ నుంచి సమాచారం కోసం వేచి చూశారు. దోపిడీకి స్కెచ్ వేయడం పూర్తయిన తర్వాత హయత్‌నగర్ ఠాణా పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి తీసుకువచ్చారు. దాన్ని వినియోగించిన దుండగులు రూపారామ్ ఇచ్చిన సమాచారంతోనే గత ఏడాది నవంబర్ 12 రాత్రి అతడి నుంచే రూ.30 లక్షల బ్యాగ్ లాక్కుపోయారు. ఎవరికీ అనుమానం రాకూడదని రూపారామ్ ఇక్కడే ఉండిపోయాడు.. మిగిలిన ఇద్దరూ వాహనాన్ని వదిలేసి తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. పట్టుకోలేకపోయిన పోలీసులు.. ఈ కేసులో భజన్‌లాల్, మంగీలాల్‌లను పట్టుకోవడానికి రెండుమూడు విడతల్లో ప్రత్యేక బృందాలు రాజస్థాన్‌కు వెళ్లాయి. బర్మేర్ జిల్లాలో గాలించిన అధికారులు భజన్‌లాల్‌ను మాత్రం పట్టుకోగలిగారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే మంగీలాల్ ప్రధాన సూత్రధారని, దోచుకున్న డబ్బు మొత్తం అతడి వద్దే ఉందని తేలింది. దీంతో మంగీలాల్‌ను పట్టుకోవడానికి మరికొన్ని ప్రయత్నాలు జరిగాయి. బర్మేర్ జిల్లా పాకిస్థాన్ బోర్డర్‌కు సమీపంలో ఉండటంతో పోలీసులు రాక పసిగట్టిన ప్రతిసారీ అతడు సరిహద్దుల వద్దకు వెళ్లి తప్పించుకున్నాడు. ఓ దశలో అతడి గ్రామానికి చెందిన పెద్దలతో ‘కేసు రాజీ చేయిస్తే డబ్బు తిరిగి ఇచ్చేస్తా’నంటూ బేరసారాలకు దిగాడు. దీనికి తొలుత ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాన సూత్రధారి చిక్కకుండానే, డబ్బు రికవరీ కాకుండానే కేసు దర్యాప్తు ముగిసింది. హయత్‌నగర్ పోలీసులు తమ పరిధిలోని బైక్ చోరీ కేసులో భజన్‌లాల్‌ను అరెస్టు చేశారు. ఉన్నపళంగా మహంకాళి పరిధిలో నమోదైన దోపిడీ కేసు లోక్ అదాలత్‌లో రాజీ అయింది. -
దారి దోపిడీలతో వణుకుతున్న భాగ్యనగర వాసులు
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దొంగలు వరుస దారి దోపిడీలతో పోలీసులను పరుగులెత్తిస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్ఖానాలో నేడు వృద్దుడిపై దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకున్నారు. యాప్రాల్‌కు చెందిన అనిల్ దంపతులు మూడు బ్యాంకుల నుంచి ఐదు లక్షలు డ్రా చేశారు. రోడ్డు దాటుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు దాడి చేసి డబ్బు బ్యాగుతో పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగల వేటలో పడ్డారు పోలీసులు. దారి దోపిడీలు పెరుగుతుండడంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకువస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్న దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. క్షణాల్లో వచ్చి డబ్బు సంచులు లాక్కుపోతున్నారు. ఇకనైనా దారి దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను హైదరాబాద్ వాసులు కోరుతున్నారు.