సాక్షి, హైదరాబాద్ : రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మధు (31) చేతిలోని ఎస్‌ఎల్‌ఆర్ గన్ పేలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 2010లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎన్నికైన సూర్యాపేట నేరేడుచర్ల మండలం బత్తులపాలెం గ్రామనికి చెందిన ఎ.మధు అంబర్‌పేట్‌లోని న్యూప్రేమ్‌నగర్‌లో భార్య నాగమణి, కుమార్తె రిషిక సాయి, కుమారుడు రిశాంక్ సాయిలతో కలిసి ఉంటున్నాడు. రాణిగంజ్ హైదర్‌బస్తీలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెన్సీ చెస్ట్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల నుంచి కరెన్సీని ఇక్కడికి తీసుకుని రావడం, ఇక్కడి నుంచి అవసరం ఉన్న చోటకు నగదును తరలిస్తుంటారు.
యథావిధిగా ఆదివారం ఉదయం మధు సెంట్రీ డ్యూటీలో చేరాడు. కొద్దిసేపటికి గన్ పేలిన శబ్దం వచ్చింది. తోటి సిబ్బంది, అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు అక్కడికి వచ్చి చూడగా చేతిలో ఎస్‌ఎల్‌ఆర్ గన్ (7.62 ఎంఎం)తో రక్తపు మడుగులో మధు పడివున్నాడు. అతన్ని పరిశీ లించగా తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మరణించాడు. మహంకాళి ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, క్లూస్ టీమ్‌తోపాటు ఎస్పీఎఫ్ డీజీ గోపాలకృష్ణ కూడా అక్కడికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తూటా అతడి గడ్డం కింది నుంచి నేరుగా తల పైభాగం మీదుగా బయటకు వచ్చి పైన బిల్డింగ్ స్లాబుకు తలిగింది. బుల్లెట్ తగిలిన విధానం చూస్తే మిస్‌ఫైర్ అయినట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం లేదా, అధికారుల వేధింపులతో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment