గాయపడిన రాజు
సాక్షి, హైదరాబాద్: మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కానిస్టేబుల్ లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన మేరకు.. పార్శీగుట్టకు చెందిన రాజు (42) రాణిగంజ్‌లోని లారీ అడ్డాలో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే వాహనాన్ని నిలుపుకుని ఉంటాడు. ఈనెల 21న రాణిగంజ్‌లోని ఆలయం వద్ద పడుకున్నాడు. అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆయనను బూటుకాలితో తన్ని లేపాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ లాఠీతో తీవ్రంగా కొట్టాడు.
గురువారం ఉదయం రాజును కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకు వెళ్లినా చేర్చుకోలేదు. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు రాగా.. కొట్టడం తప్పేకానీ తామే చికిత్స చేయిస్తామని పోలీసు అధికారులు చెప్పడంతో చేసేది ఏమి లేక వారు ఒప్పుకున్నారు. పోలీసులే పద్మారావునగర్‌లోని పల్స్ ఆస్పత్రికి తీసుకెవెళ్లి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి చికిత్సకు ఒప్పించారు.
అటు తర్వాత విషయం మీడియాకు తెలియడంతో బయటకు పొక్కింది. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడని, వారు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment