బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు..నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయా లని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ రుణమాఫీ ఇవ్వలే కనే కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కొత్తకథలు చెబుతోందని మండిపడ్డారు. దీనిపై గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు విధించని విషయాన్ని గుర్తుచేశారు.సోమవారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ ఏ నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు రుణ మాఫీకి మాత్రం రేషన్‌కార్డును లింక్ చేస్తోందని ధ్వజమెత్తారు. చాలామందికి ఇది వర్తించకుండా ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఒకే రేషన్‌కార్డుపై చాలామంది పేర్లు ఉంటాయని, అందులో నలుగు రికి రుణాలుంటే ఒక్కరికే మాఫీతో మిగతావారు నష్ట పోతారన్నారు. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి చేర్చుకోవాలని సీఎంకు సూచించారు.
సీఎం రేవంత్‌కు మరో బహిరంగలేఖ
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగలేఖలో మహేశ్వర్‌రెడ్డి కోరారు. పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు వెల్లడించినా.. సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీరులో మార్పు రాకపోతే ప్రజాక్షేత్రంలో సర్కార్ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment