మీరిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీకి రేవంత్ సర్కార్ తూట్లు పొడిచింది
ఆ హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళన చేస్తాం
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ,ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్‌రెడ్డి సర్కార్ నీరుగార్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీకి అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.
రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్ల మాఫీతో రైతులను నట్టేట ముంచిందంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆదివారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. వరంగల్ డిక్లరేషన్‌లో మీరిచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని హెచ్చరించారు.
47 లక్షల మందికి గాను 22 లక్షల మందికేనా?
‘అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్.. 8 నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు.
‘రూ. రెండు లక్షల రుణమాఫీకి రూ.49,500 కోట్లు కావాలని ఎస్‌ఎల్‌బీసీ అంచనా వేయగా, రూ.40వేల కోట్లు అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కేబినెట్ భేటికి వచ్చేసరికి దాన్ని రూ.31 వేల కోట్లకు కుదించారు. తీరా మూడు విడతల మాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు’ అని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ కాని అన్నదాతల ఆందోళనలతో యావత్ తెలంగాణ అట్టుడుకుతోందని, రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వారం రోజుల్లోనే 1,20,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ చావుకు కారకులెవరు?
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్య లతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జీతం రాక కుటుంబం గడవక, భార్యా పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడని, ఈ ఘటన విషాదకరమని పేర్కొన్నారు.
ప్రతీనెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలి స్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రచారం చేసుకోవడమే తప్ప అందులో వాస్తవం లేదని విమర్శించారు. కాగా తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వానికి పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment