
సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ
జనవరి నెలాఖరుకల్లా కార్పొరేషన్ పదవుల భర్తీ
విలేకరులతో ఇష్టాగోష్టిలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించనున్న జైబాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభకు వీరు హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న వీలుకాకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఖర్గే, రాహుల్‌లు వస్తారని అన్నారు.
శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టి మాట్లాడుతూ, ఈనెలాఖరుకల్లా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి చేస్తారని, ఈ మేరకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి టీపీసీసీకి ముగ్గురు లేదా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, ఎంతమందికి ఆ పదవి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తామని, సమర్థులైన నాయకుల కోసం చూస్తున్నామని చెప్పారు.
పార్టీ కార్యవర్గం నియామకంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడారన్నది పరిశీలించాల్సి ఉందని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి త్వరలోనే చేరికలుంటాయని, ఎమ్మెల్యేలు కూడా చేరతారని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటామన్నారు.