అగ్రిటెక్‌ స్టార్టప్‌లకు బూస్ట్‌ | Union Minister Shivraj Singh Chouhan launched AgriSURE Fund and Krishi Nivesh Portal | Sakshi
Sakshi News home page

అగ్రిటెక్‌ స్టార్టప్‌లకు బూస్ట్‌

Published Wed, Sep 4 2024 8:30 AM | Last Updated on Wed, Sep 4 2024 9:48 AM

Union Minister Shivraj Singh Chouhan launched AgriSURE Fund and Krishi Nivesh Portal

న్యూఢిల్లీ: అగ్రిటెక్‌ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రూ.750 కోట్ల ఫండ్‌ ‘అగ్రిష్యూర్‌’ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం పురోగతి లక్ష్యంగా దాదాపు రూ.14,000 కోట్లతో ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘అగ్రిష్యూర్‌’ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...

  • రూ.750 కోట్ల ‘అగ్రిష్యూర్‌’ (స్టార్టప్‌లు, రూరల్‌ ఎంటర్‌ప్రైజెస్‌) ఫండ్‌ ఈక్విటీ అలాగే డెట్‌ క్యాపిటల్‌ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లు, ‘అగ్రిప్రెన్యూర్‌’లకు మద్దతు ఇస్తుంది.

  • స్టార్టప్‌లు ఈ నిధిని వినియోగించుకోవాలి. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అగ్రిటెక్‌ స్టార్టప్‌లకు ఎటువంటి నిధుల కొరతనూ ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకుంటారు.

  • గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది.  

  • వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఈ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 18 శాతం వాటాను కలిగి ఉంది.  

  • రైతులు అతిపెద్ద ఉత్పత్తిదారులు మాత్రమే కాకుండా అతిపెద్ద వినియోగదారులు కూడా అన్న విషయాన్ని గమనించాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పరోక్ష సహకారం.

  • రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

  • ఉత్పత్తి పెంపు, ముడి పదార్థాల వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎరువులపై కేంద్రం భారీ రాయితీలూ 
    కల్పిస్తోంది.

  • వ్యవసాయ రంగానికి కొత్త ప్రయోగాలు అవసరం. చిన్న రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేందుకు గ్రూపులుగా ఏర్పడే అంశాన్ని వారు పరిశీలించాలి.  

  • మితిమీరిన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం మంచిది కాదు. సాగునేలను సారవంతమైనదిగా కొనసాగించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఏఐఎఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానం  

వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌) కింద వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, రాష్ట్రాలకు వారి కృషిని గుర్తింపుగా వ్యవసాయ మంత్రి ఏఐఎఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అవార్డులు అందుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా అవార్డును స్వీకరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విభాగంలో బరోడా రాజస్థాన్‌ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, పంజాబ్‌ గ్రామీణ బ్యాంక్, బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్,  సర్వ హరియాణా గ్రామీణ బ్యాంక్‌ ఉత్తమ పనితీరుకు అవార్డులు అందుకున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచి, అవార్డులను అందుకున్న రాష్ట్రాలలో తెలంగాణసహా మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!

‘కృషినివేష్‌’ పోర్టల్‌ ఆవిష్కరణ..

‘కృషినివేష్‌’ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్టల్‌ను కూడా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ పెట్టుబడి అవకాశాలు సంబంధిత వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్చగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.   వ్యవసాయ వ్యాపారాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి,  రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికే ఈ పోర్టల్‌ అని ఆయన అభివర్ణించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్‌ చేసుకోవడానికి సంబంధించి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలోని విభిన్న వాటాదారులకు ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుందని చౌహాన్‌ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement