
డేటా లీక్ వెనుక టెలికం ఆపరేటర్లు
ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు
లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: తమ వ్యక్తిగత డేటా పబ్లిక్ డొమైన్‌లోకి చేరిపోయినట్టు మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. పబ్లిక్ డొమైన్‌లో తమ డేటా లీక్ అయినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది చెప్పారు. ఇందులో సగం మంది తమ ఆధార్ లేదా పాన్ వివరాలు లీక్ అయినట్టు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 375 జిల్లాల పరిధిలో 36వేల మంది స్పందనలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ విభాగాలు తమ డేటా లీకేజీకి కారణమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పబ్లిక్ డొమైన్‌లో తమ డేటా లీకేజీకి టెలికం ఆపరేటర్లు కారణమని 65 శాతం మంది భావిస్తుంటే, 63 శాతం మంది ఈ–కామర్స్ యాప్‌లు లేదా సైట్లు, 56 శాతం మంది బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కారణమై ఉంటాయని చెప్పారు.
స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇందుకు కారణమని 50 మంది అనుకుంటున్నారు. 48 శాతం మంది పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉంటాయని చెప్పగా.. 26 శాతం మంది విద్యా సంస్థలు, 37 శాతం మంది వ్యాపార సంస్థల పాత్ర ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment