ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యాన్ని 341.55 మిలియన్ టన్నులుగా నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.
రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, 31 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరిలు రైతులు వేగంగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుల ఆదాయం పెరగని ప్రాంతాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాము. అలాంటి ప్రాంతాల్లోని రైతులపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుందని ఈ సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 131 రోజుల్లో రైతుల ప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని.. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. 17 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.
ధాన్యం ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, రైతులకు నష్టపరిహారం అందించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ధాన్యాలకు సరైన నిల్వ సౌకర్యాలు కల్పించడం వంటి వాటితో పాటు ప్రపంచానికి భారతదేశాన్ని ఆహార కేంద్రంగా స్థాపించడం వంటివి ప్రభుత్వ లక్ష్యాలని చౌహాన్ వివరించారు. రబీ సీజన్‌లో ఆవాలు, శనగలు మొదలైన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఆరోపణలపై శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు వచ్చే సమావేశంలో సమాధానాలు చెబుతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment