వ్యవసాయ రంగం వృద్ధికి ఆహార ద్రవ్యోల్బణం పెద్ద ఆటంకంగా నిలుస్తోంది. దానికితోడు కరవు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిమితులు..వంటి చాలా అంశాలు ఈ రంగంలో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. రానున్న బడ్జెట్‌లో అన్నదాత ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరింత చొరవచూపి నిధులు కేటాయించాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు వ్యవసాయ రంగం పుంజుకునేలా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యవసాయం రంగంలోని కొన్ని డిమాండ్లు..
ఈ రంగంలో ఉత్పత్తి స్థిరంగా ఉంటున్న పత్తి, నూనె గింజలు వంటి పంటలకు మెరుగైన విత్తనాలు అందించాలి. వాతావరణ మార్పుల వల్ల గోధుమలు, చక్కెర, పచ్చిమిర్చి, శనగ, పండ్లు, కూరగాయల ఉత్పత్తి దెబ్బతింటోంది. ప్రభుత్వం స్థానికంగా ఆయా ఉత్పత్తులను పండిస్తున్నవారికి ప్రోత్సాహకాలు అందించాలి. ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విధానాల్లో తరచూ మార్పులుండడంతో నష్టాలు ఎక్కువవుతున్నాయి. గోధుమలు, బియ్యం, చక్కెర, ఉల్లిగడ్డ, పప్పులు వంటి వాటిపై కేంద్రం ఎగుమతులు నిషేధించింది. ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం వల్ల రైతు ఆదాయం తగ్గిపోతుంది.
ఇదీ చదవండి: నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
వ్యవసాయ రంగంలో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి కేంద్రం నిధులు పెంచాలి. జీడీపీలో ఈ విభాగానికి కేటాయించే నిధులను 0.6 శాతం నుంచి కనీసం 1 శాతానికి తీసుకురావాలి. పప్పుధాన్యాలు, గోధుమలు, నూనెగింజలు, పత్తి విత్తనాల్లో పంట దిగుబడి పెంచేలా మరిన్ని పరిశోధనలు జరగాలి. ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి. ఎరువుల సబ్సిడీల్లో యూరియా వాటాను తగ్గించాలి. అందుకు ప్రత్యామ్నాయంగా పాస్ఫరస్, పొటాషియం వాటాను పెంచాలి. బయో ఫెర్టిలైజర్లను సబ్సిడీ పరిధిలోకి తీసుకురావాలి. కందులు, పెసలు వంటి పప్పుధాన్యాలతో పాటు ఉల్లిపాయ వంటి ఆహార ఉత్పత్తుల బఫర్ స్టాక్‌ను రూపొందించాలి. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో భాగంగా ఏటా అందిస్తున్న పెట్టుబడి ప్రోత్సాహకాన్ని రూ.6000 నుంచి రూ.8000కు పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment