సాక్షి, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయానికి యువరైతులు దూరమవుతున్నారు. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూ కమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోక ఈ రంగాన్నే వీడుతున్నారు. నగరీకరణకు అనుగుణంగా గ్రామాల్లోనూ జీవనోపాధి ఖర్చులు పెరగడంతో అంత మేర ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మరలుతున్నారు.
ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డెవలప్‌మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్, గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇంక్యుబేటర్, ట్రాన్స్‌ఫార్మింగ్ రూరల్ ఇండియా సంస్థలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థలు ‘స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్‌మెంట్–2024’ పేరుతో ఇటీవల నివేదికను విడుదల చేశాయి.
వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో యువ రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొనేందుకు లేదా ఇతర రంగాలను ఎంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 60 శాతం మంది యువత సాగును వీడారని పేర్కొంది.
చిన్న కమతాలు ఎక్కువే... : రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ (2.47 ఎకరాలు) నుంచి 0.89 హెక్టార్ల (2.19 ఎకరాలు)కు తగ్గింది. కుటుంబాల విభజనతో భూముల పంపకంతోపాటు కొత్తగా సాగు, జీవనోపాధి కోసం సొంతంగా భూముల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర కారణాలతో చిన్న కమతాలు పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు, 2.48 నుంచి 4.94 ఎకరాలను చిన్నకారు, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలను పాక్షిక మధ్యతరహా, 9.89 నుంచి 24.77 ఎకరాలుంటే మధ్యతరహా, 24.78 ఎకరాలకన్నా పైన ఉంటే పెద్ద భూకమతంగా పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, భద్రాద్రి జిల్లాల్లో 1.5, 1.4, 1.3 హెక్టార్ల విస్తీర్ణం సగటున ఉంటే కరీంనగర్, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లాల్లో 0.75, 0.74, 0.60 హెక్టార్లుగా సగటు విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాలతో సేద్యం ఎక్కువగా జరుగుతుందని ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక పేర్కొంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన ఇతని పేరు గారె రాజు. అతనికి వారసత్వంగా ఎకరం భూమి ఉంది. ఇది పంట సాగుకు సరిపోకపోవడంతో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. ట్రాక్టర్ కూడా కొన్నాడు. 2020 నుంచి 2024 వరకు రూ. లక్షలు వెచ్చించి వ్యవసాయం చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దీంతో ఫొటోగ్రఫీని జీవనాధారంగా మార్చుకున్నాడు. వ్యవసాయంపై ప్రేమ ఉన్నా సాగు ఖర్చులకు తగ్గట్టు లాభాల్లేక సాగుకు దూరమైనట్లు చెప్పాడు.
పెట్టుబడి ఖర్చుకు తగ్గ ఆదాయం రాక అవస్థలు
» చిన్న భూకమతాలు, వాతావరణ అనిశ్చి తి, తక్కువ దిగుబడులూ కారణం
» కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అడుగులు
» స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్‌మెంట్–2024 నివేదికలో వెల్లడి
» యువతకు నైపుణ్యాల పెంపుతో ఆదాయం పెంచొచ్చంటున్న నిపుణులు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి
వ్యవసాయానికి దూరమవుతున్న యువతకు బ్రేక్ వేయాలంటే విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పాలి. మొక్కజొన్నల నుంచి పేలాల తయారీ, మామిడి నుంచి గుజ్జు తీయడం, మిరపకాయ నుంచి కారం... ఇలా వివిధ పరిశ్రమలను గ్రామాల్లో నెలకొల్పాలి. అలాగే యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలి. – ఉమారెడ్డి, ఏడీఆర్, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం
ట్రైనింగ్ కోర్సులు అందించాలి
యువ రైతులకు పంటల సాగు పద్ధతులపై సరి్టఫికెట్ ట్రైనింగ్ కోర్సులు అందించాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణతో కూడిన యాజమాన్య పద్ధతులు తీసుకురావాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లను విస్తృతం చేయాలి. ఈ కేంద్రాల ద్వారా పనిముట్లను అద్దెకు ఇస్తే యువ రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే యువ రైతులకు మేలు జరుగుతుంది. – కె. భాస్కర్, సంచాలకుడు, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మహబూబాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment