ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
సాక్షి, కర్నూలు: రైతుల రుణమాఫీకి సంబంధించి మొదటి కంతు(ఇన్‌స్టాల్‌మెంట్)ను అక్టోబర్ 15లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సహకరించకపోయినా రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఆయన బుధవారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు కర్నూలు నగరంలోని సి.క్యాంప్ రైతు బజార్‌ను పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకర్లు ఈనెల 26వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. ఆ తర్వాత నిధుల సమీకరణను అనుసరించి మూడు విడతల్లో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. మొదటి కంతు(ఇన్‌స్టాల్‌మెంట్)ను అక్టోబర్ 15లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అనంతరం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాల్లో భాగంగా బి.తాండ్రపాడు, హుస్సేనాపురం గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకుని అత్యాధునిక యంత్రాల సహకారంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత తన దృష్టికొచ్చిందని, మరో రెండు రోజుల్లో జిల్లాకు సరిపడా యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు.