న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్ల (ఎన్‌ఎఫ్‌వో) ఊతంతో జులైలో నికరంగా రూ. 22,583 కోట్ల నిధులు వచ్చాయి. దీంతో వరుసగా అయిదో నెలా ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చినట్లయింది. జూన్‌తో పోలిస్తే జులైలో రూ. 5,988 కోట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ. 9,115 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 3,437 కోట్లు, మే నెలలో రూ. 10,083 కోట్ల మేర ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అంతకన్నా ముందు 2020 జులై నుంచి 2021 ఫిబ్రవరి దాకా వరుసగా ఎనిమిది నెలల పాటు నిధుల ఉపసంహరణ కొనసాగింది. తాజా పరిణామాలతో జూన్ ఆఖరున రూ. 33.67 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ జులై ఆఖరుకు రూ. 35.32 లక్షల కోట్లకు చేరింది.
లిక్విడిటీ.. విధానాల ఊతం..
రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాలు, కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండటం, టీకాల ప్రక్రియతో కోవిడ్ మహమ్మారిని స్థిరంగా కట్టడి చేయగలుగుతుండటం, దేశ..విదేశాల నుంచి వచ్చే నిధుల (లిక్విడిటీ)ఊతంతో ఈక్విటీ మార్కెట్లు చారిత్రక గరిష్టాలను తాకుతున్నాయని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేష్ తెలిపారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యుచువల్ ఫండ్ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ల ద్వారా ఈక్విటీ ర్యాలీలో పాలుపంచుకుంటున్నారని ఆయన వివరించారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలు ఇటీవల మెరుగైన రాబడులు ఇవ్వడం, కోవిడ్ రెండో విడతలోనూ మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నాయని ఫండ్స్‌ఇండియా సంస్థ రీసెర్చి విభాగం హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈక్విటీల్లోకి ప్రవహించిన నిధుల్లో 50 శాతం భాగం ఎన్‌ఎఫ్‌వోల ద్వారా వచ్చినవేనని వైట్ ఓక్ క్యాపిటల్ సీఈవో ఆశీష్ సోమయ్య పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన స్కీమ్ కేటగిరీ నిబంధనలకు అనుగుణంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) నిధులను కేటాయించడం ఇందుకు ఓ కారణమని వివరించారు.
మరిన్ని విశేషాలు..
►ఈక్విటీ ఫండ్స్‌లో విభాగాలవారీగా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్‌లోకి అత్యధికంగా రూ. 11,508 కోట్లు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఇతర ఎన్‌ఎఫ్‌వోలు దాదాపు ఏకంగా రూ. 13,709 కోట్లు సమీకరించడం ఇందుకు దోహదపడింది.
►గత నెలలో హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ. 19,481 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ. 14,924 కోట్లను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో పెట్టారు.
►ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల (ఈఎల్‌ఎస్‌ఎస్) నుంచి మాత్రం రూ. 512 కోట్లు, వేల్యూ ఫండ్స్ నుంచి రూ. 462 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి నికరంగా రూ. 257 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 360 కోట్లు.
►డెట్ మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా రూ. 73,964 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 31,740 కోట్లు రాగా, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 20,910 కోట్లు, తక్కువ వ్యవధి ఉండే ఫండ్స్‌లోకి రూ. 8,161 కోట్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లోకి రూ. 6,656 కోట్లు వచ్చాయి.
►వివిధ విభాగాలవారీగా చూస్తే మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.14 లక్షల కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 15,320 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment