న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నవంబర్ నెలలో 76 శాతం తగ్గిపోయి రూ.2,258 కోట్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,306 కోట్ల రికార్డు స్థాయి (ఒక నెలలో ఇదే గరిష్టం) పెట్టుబడులు నవంబర్‌లో నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్ ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.13,041 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది మే నెల నుంచి సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లపైనే నమోదవుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.12,976 కోట్లు, ఆగస్ట్‌లో రూ.12,693 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, మేలో రూ.12,286 కోట్ల చొప్పున సిప్ సాధనం ద్వారా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) సిప్ రూపంలో మొత్తం రూ.87,275 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. సిప్ అన్నది పెట్టుబడి మొత్తాన్ని ఒకే విడత పెట్టకుండా, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని, కొన్ని వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పించే సాధనం.
గణాంకాలు..
►నవంబర్ నెలలో కొత్తగా 11.27 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.04 కోట్లకు చేరింది.
►మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో వచ్చిన నికర పెట్టుబడులు రూ.13,263 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెలలో వచ్చిన రూ.14,405 కోట్ల కంటే స్వల్పంగా తగ్గాయి.
►డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.3,668 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో డెట్ పథకాల నుంచి రూ.2,818 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే పరిస్థితి మారింది.
►ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌లోకి కలిపి మొత్తం రూ.10,394 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో రూ.8,602 కోట్లు ఒక్క ఇండెక్స్ ఫండ్సే ఆకర్షించాయి. గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.195 కోట్లు వచ్చాయి.
►43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ అక్టోబర్ చివరికి ఉన్న రూ.39.5 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.40.37 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.
►మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య 13.97 కోట్లకు పెరిగింది.
రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం..
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నిలకడగా, సిప్‌ల ద్వా రా పెట్టుబడులు కొనసాగించినట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ వెల్లడించారు. ‘‘రిటైల్ పథకాల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ప్రజలు లాభాలను స్వీకరిస్తున్నారు. పండుగల సందర్భంగా వినియోగం పెరగడమే ఇందుకు కారణం. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధి పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉంది. కనుక వారు వెంటనే మళ్లీ మార్కెట్లోకి వస్తారు. రానున్న బడ్జెట్ మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిస్తుంది. పలు పథకాల్లోకి మరిన్ని పెట్టుబడులు రావడానికి వీలు కల్పిస్తుంది. ఆర్‌బీఐ రేట్ల పెంపు ఆగిపోయినప్పుడు డెట్ పథకాల్లో స్థిరత్వం వస్తుంది’’అని వెంకటేశ్ తెలిపారు.
ఇన్వెస్టర్లలో పరిణతి..
‘‘దేశ ఈక్విటీ మార్కెట్లో ఆరోగ్యకరమైన ధోరణి ఏమిటంటే సిప్ ద్వారా పెట్టుబడులు నికరంగా పెరుగుతుండడం. ఇవి నవంబర్‌లో కొత్త గరిష్టానికి చేరాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్ ఎంతో విజయవంతమైన విధానంగా నిరూపితమైంది. సిప్ ద్వారా పెట్టుబడులు పెరగడం దేశ ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగినదానికి నిదర్శనం’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment