న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూలై నెలలోనూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే నెలవారీ పెట్టుబడులు రూ.15,245 కోట్లకు చేరాయి. ఒక నెలలో సిప్ పెట్టుబడుల పరంగా ఇదే గరిష్ట రికార్డు కావడం గమనార్హం. జూన్ నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,734 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు 2022 అక్టోబర్ నుంచి ప్రతి నెలా రూ.13వేల కోట్లకు పైనే వస్తున్నాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి జూలై నెలలో మొత్తం మీద రూ.7,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో వచి్చన పెట్టుబడులతో పోల్చిచూస్తే 12 శాతం తగ్గాయి. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. జూలై నెలలో ఈక్విటీ, డెట్ ఇలా అన్ని విభాగాలు కలసి మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.82,046 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
బలపడుతున్న సిప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈక్విటీల్లోకి సిప్ రూపంలో రూ.58,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్ రూ.1.56 లక్షల కోట్లను సిప్ రూపంలో ఆకర్షించాయి. సిప్ అనేది ప్రతీ నెలా పెట్టుబడులు పెట్టుకు నే సాధనం. దీనివల్ల మార్కెట్లలో ఉండే అస్థిరతల రిస్క్ కొనుగోలుపై తగ్గుతుంది. ఈ సానుకూలతలను అర్థం చేసుకుంటున్న ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.
29 నెలలుగా సానుకూల పెట్టుబడులు
ఈక్విటీల్లోకి 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు వస్తున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే జూన్ నెలలో ఈక్విటీ పథకాలు రూ.8,637 కోట్లను ఆకర్షించగా, జూలైలో రూ.7,626 కోట్లకు తగ్గాయి. జూలై నెలలో ఐదు నూతన పథకాలు ప్రారంభం కాగా, వీటి వరకే రూ.3,011 కోట్లు సమీకరించాయి. లార్జ్‌క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్, ఫ్లెక్సీక్యాప్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోని పథకాలు పెట్టుబడులను ఆకర్షించాయి.
ఈక్విటీ ఫండ్స్
► స్మాల్‌క్యాప్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,171 కోట్లు వచ్చాయి. గడిచిన నాలుగు నెలలుగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి ఇతర పథకాలతో పోలిస్తే అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి.
► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
► లార్జ్‌క్యాప్ నుంచి రూ.1,880 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గడిచిన మూడు నెలలుగా లార్జ్‌క్యాప్ పథకాలు పెట్టుబడులను కోల్పోతున్నాయి.
► ఫోకస్డ్ ఫండ్స్ విభాగం నుంచి రూ.1,067 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ విభాగం గడిచిన నాలుగు నెలలుగా పెట్టుబడులను కోల్పోతోంది.
► ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి రూ.592 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.932 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.
► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,327 కోట్లు, మిడ్‌క్యాప్‌ఫండ్స్ రూ.1,623 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.342 కోట్లు, వ్యాల్యూఫండ్స్ రూ.703 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,429 కోట్ల చొప్పున పెట్టుబడులను రాబట్టాయి.
డెట్ ఫండ్స్
► డెట్ ఫండ్స్‌లోకి రూ.61,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఈ విభాగం నుంచి నికరంగా రూ.14,135 కోట్లకు బయటకు వెళ్లడం గమనార్హం.
► అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.51,938 కోట్లు వచ్చాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.8,608 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.7,027 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.2,865 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,000 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
► ఓవర్ నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.10,746 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి రూ.1,309 కోట్లను ఉపసంహరించుకున్నారు.
లాభాల స్వీకరణ..
‘‘మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో అన్నింటికంటే సిప్ పనితీరు గొప్పగా ఉంది. 33 లక్షల నూతన సిప్ ఖాతాలు నమోదయ్యాయి’’అని యాంఫి సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జూన్‌తో పోలిస్తే జూలై నెలలో ఈక్విటీల్లోకి నికర పెట్టుబడులు తగ్గడానికి లాభాల స్వీకరణే కారణమై ఉండొచ్చని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి కూడా అనుసరించి ఉండొచ్చన్నారు.
రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
Published Thu, Aug 10 2023 4:50 AM | Last Updated on Thu, Aug 10 2023 7:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment