పంట రుణాలు ఎలా చెల్లిస్తారు? | How to pay crop loans, asks reserve bank | Sakshi
Sakshi News home page

పంట రుణాలు ఎలా చెల్లిస్తారు?

Published Thu, Jul 17 2014 2:07 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

పంట రుణాలు ఎలా చెల్లిస్తారు? - Sakshi

పంట రుణాలు ఎలా చెల్లిస్తారు?

 సమగ్ర ప్రణాళిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు ఆర్‌బీఐ లేఖ
 తర్వాతే రీషెడ్యూల్‌పై నిర్ణయమని స్పష్టీకరణ
 నిధులు ఎలా సమకూరుస్తారంటూ ఆరా

 
 సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేసినప్పటికీ ఆ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారో చెప్పాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను రిజర్వ్ బ్యాంక్ ప్రశ్నించింది. గడువు ముగిసిన తర్వాత రుణాలు చెల్లించేందుకు నిధులను ఎలా సమకూరుస్తారో తెలియజేయాలని కోరింది. అసలు రుణ మాఫీని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనుసరించే ప్రణాళిక ఏమిటో వివరించిన తర్వాతే.. రీషెడ్యూల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది.

లేనిపక్షంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కారులకు ఆర్‌బీఐ లేఖ రాసింది. రాష్ర్టంలో తుపాను, కరువు ప్రభావిత మండలాల్లో ఉన్న ఖాతాల సంఖ్య, రుణాల మొత్తం, రీషెడ్యూల్ చేసిన రుణాలను ప్రభుత్వం  తిరిగి చెల్లించే విధానం, నిధుల సమీకరణ తీరు వంటి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ దీపాలీపంత్ జోషి రాసిన లేఖ బుధవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు  అందింది. తుపాను, కరువు పీడిత మండలాలకు మాత్రమే రీ-షెడ్యూల్ వర్తిస్తుందని, ఇతర మండలాలకు విస్తరించకూడదని స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 27 వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే రీ-షెడ్యూల్ చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అలాగే బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ పరిధిలో చేర్చలేమని కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో గత ఖరీఫ్‌లో గుర్తించిన 323 తుపాను, కరువు పీడిత మండలాల్లో రైతులు తీసుకున్న సుమారు 7,500 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 572 మండలాల్లోని 12 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.10 వేల కోట్లలోపు పంట రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 ఆర్‌బీఐ లేఖలోని ముఖ్యాంశాలు
 

  •      రీషెడ్యూల్ మూడేళ్లకు మించి ఉండదు. తొలి ఏడాది మారటోరియం. మిగతా రెండేళ్లలో రుణాలు తిరిగి చెల్లించాలి.
  •      గత ఖరీఫ్‌లో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే వర్తింపు. గోల్డ్ లోన్స్‌కు, పాత బకాయిలకు వర్తించదు.
  •      తుపాను, కరువు ప్రభావిత మండలాలకే రీషెడ్యూల్.
  •      మాఫీ చేయాలని భావిస్తే రైతుల రుణాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించాలి.
  •      సర్కారు తిరిగి చెల్లించేవరకూ రీషెడ్యూల్ అయిన పంట రుణాలు ఆయా రైతుల పేరు మీదనే ఉంటాయి.
  •      పంట రుణాలను బ్యాంకులకు చెల్లించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందో వివరించాలి.
  •      రుణ మాఫీ కసరత్తును ఎప్పటిలోగా ముగిస్తారనే షెడ్యూల్‌ను కూడా ముందే స్పష్టం చేయాలి.
  •      పూర్తి స్థాయి ప్రణాళిక అందిన తర్వాతే తదుపరి చర్యలు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement