రుణమాఫీపై చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షాక్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రుణమాఫీకి తాము అనుకూలం కాదని తేల్చి చెప్పింది. రుణమాఫీ అమలు బ్యాంకర్ల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని... రుణాలు సక్రమంగా చెల్లించేవారికి మాఫీ అంశం అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొంది. రుణమాఫీని నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను ఆమోదించేది లేదని తెలిపింది.
రుణమాఫీ వంటి పథకాన్ని తాము ప్రోత్సహించలేమని ఖరాఖండీగా చెప్పేసింది. ఆ మేరకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలి పంత్ జోషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రుణమాఫీ వంటి విధానం... తిరిగి చెల్లించే సంస్కృతిని నాశనం చేస్తుందని.. దీనివల్ల బ్యాంకుల పరిస్థితి దిగజారుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీకి తాము అనుకూలంగా దీపాలి పంత్ జోషి ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా ఆర్బీఐ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 25న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐని రుణమాఫీ అంశంపై సడలింపులు కోరే అవకాశం ఉంది.
రుణమాఫీ అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ వార్త అశనిపాతమనే చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. కమిటీ ఈ నెల 22లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత 45 రోజుల్లో తుది నివేదిక వచ్చాక కేంద్రంతో మాట్లాడి మాఫీకి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షరతులు షాక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు.