తాజాగా.. మంగళవారం 7.27 శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు మరో రూ.3,000 కోట్ల అప్పు
సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని ప్రభుత్వానికి సమీకరించింది
ఇంత అప్పుచేసినా పెన్షన్ పెంపు తప్ప మిగతా హామీల ఊసేలేదు
మరి ఈ అప్పంతా దేనికి వ్యయం చేశారో?
ఎల్లో మీడియాకు కనిపించని బాబు అప్పులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ రెండున్నర నెలల్లో ఏకంగా రూ.15,000 కోట్లు అప్పుచేసింది. తాజాగా.. మంగళవారం 7.27 శాతం వడ్డీతో రూ.3,000 కోట్ల అప్పుచేసింది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 17 సంవత్సరాల కాల వ్యవధిలో మరో రూ.1,000 కోట్లు, 22 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకో రూ.1,000 కోట్లు చెల్లించేలా చంద్రబాబు ఈ అప్పుచేశారు.
సెక్యురిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకరించింది. దీంతో.. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ రెండున్నర నెలల్లో మొత్తం రూ.15,000 కోట్లు అప్పుచేసినట్లయింది.
నాడు ఎల్లో మీడియా గగ్గోలు.. నేడు సైలెంట్
నిజానికి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ మంగళవారం అప్పుచేయనదే గడవదంటూ తప్పుపడుతూ ఎల్లో మీడియా నానా యాగీ చేస్తూ కథనాలు రాయగా.. వాటి ఆధారంగా రాష్ట్రాన్ని అప్పులు పాల్జేస్తున్నారంటూ చంద్రబాబు ఆయన బ్యాచ్ గుండెలు బాదుకున్నారు. మరిప్పుడు ఇదే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేవలం రెండున్నర నెలల్లో ఏకంగా రూ.15 వేల కోట్లు అప్పుచేసినా, మంగళవారాలు అప్పులుచేస్తున్నా ఎల్లో మీడియా ఎందుకు ఒక్క ముక్క కూడా రాయడంలేదని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
అప్పట్లో పరిమితికి లోబడి చేసినా ఏడుపే..
నిజానికి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనల మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసినా సరే రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారంటూ బూతద్దంలో చూపెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం చూస్తుంటే వాటి పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆర్థికశాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక ఇంత అప్పుచేసినా ఒక పెన్షన్ పెంపు తప్ప మిగతా హామీల్లో ఒక్కదాని గురించి కూడా చంద్రబాబు సర్కారు ఊసెత్తడంలేదని వారు గుర్తుచేస్తున్నారు. మరి ఈ అప్పులన్నీ దేనికి వ్యయం చేసినట్లో చంద్రబాబు బ్యాచ్‌తో పాటు ఎల్లోమీడియా సమాధానం చెప్పాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. అప్పులు చేయడంకాదు.. సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు.
మరి ఈ రెండున్నర నెలల్లోనే రూ.15 వేల కోట్లు అప్పుచేయడమంటే అదే సంపద సృష్టా అని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ఈ అప్పులను ఏ అభివృద్ధి పనులకు వెచ్చించారో చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment