ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, స్థూల ఆర్థిక సమాచార వెల్లడి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో చోటుచేసుకోనున్న పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 72.48 వద్ద ముగియడం లాంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ను వెంటాడుతున్న నేపథ్యంలో బలహీన సెంటిమెంట్ కొనసాగేందుకే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
‘బోటమ్ ఫిషింగ్‌కు ఇన్వెస్టర్లలో మార్కెట్‌పై ఇంకా భరోసా పెరగాల్సిఉంది. ద్రవ్య లభ్యత కొరత, మార్జిన్ ఫండింగ్ తక్కువగా ఉండటం, షార్ట్ సెల్లింగ్ వంటి పలు కారణాలు వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు మార్కెట్‌లో సెంటిమెంట్ బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉంది. అంగీకార స్థాయికి విలువ చేరుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ఈ వారంలో కీలకంగా ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
సెప్టెంబరు నెలకు సంబంధించిన ఆటో రంగ అమ్మకాల గణాంకాలు నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. అదే నెలకు చెందిన తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సమాచారం నేడు వెల్లడికానుండగా.. సేవల రంగ పీఎంఐ గణాంకాలు 4న (గురువారం) విడుదలకానుంది. ఇక మంగళవారం (అక్టోబరు 2న) గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.
టారిఫ్ విధించే యోచనలో అమెరికా
‘అమెరికా ఉత్పత్తులపై భారత్ 60% టారిఫ్ విధిస్తోంది. అవే ఉత్పత్తులను మళ్లీ అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు మేము ఎటువంటి టారిఫ్ విధించడం లేదు. వీటిపై 10–25% పన్నులు విధించే యోచనలో ఉన్నాం. అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. ఈ అంశం సైతం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం..!
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈనెల 3న సమావేశంకానుంది. అక్టోబరు 5న (శుక్రవారం) భేటీ ముగింపు తర్వాత.. మధ్యాహ్నం 2.30కి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షపై కమిటీ కీలక ప్రకటన చేయనుంది. ఆగస్టులో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ ఈసారి సమావేశంలో కూడా పెంపు ప్రకటన చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్లు పెంపు ఉండవచ్చని హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘నిధుల ప్రవాహం, కొనసాగుతున్న యుద్ధభయాలు, ముడిచమురు ధరల్లో పెరుగుదల, రూపాయి బలహీనత వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టులో మరోసారి వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఉండవచ్చు.’ అని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ విశ్లేషించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరగవచ్చని, మార్కెట్‌కు ఆర్‌బీఐ నిర్ణయం కీలకంగా ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు.
10,850 వద్ద కీలక మద్దతు
‘దిగువస్థాయిలో నిఫ్టీకి ఈవారం 10,850 పాయింట్లు కీలక మద్దతుగా ఉంది. ఈ వారం మార్కెట్ పుంజుకున్న పక్షంలో అత్యంత కీలక నిరోధం 11,050 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు.
4–నెలల గరిష్టస్థాయికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) సెప్టెంబరులో రూ.21,023 కోట్లను భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. రూ.10,825 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న వీరు.. రూ.10,198 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కుతీసుకున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,000 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ.48,000 కోట్లను ఉపసంహరించు కుని నికర అమ్మకందారులుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment