స్టాక్ మార్కెట్లను గత ఐదేళ్లుగా చూస్తున్న వారినెవరినైనా అత్యద్భుతంగా పెరిగిన రంగమేదని అడిగితే ఠక్కున ‘ఎన్‌బీఎఫ్‌సీ’ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ రంగంలోని షేర్లు ఎన్నో రెట్లు పెరిగాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని జనానికిచ్చే ఈ సంస్థలు... బ్యాంకులకన్నా వేగంగా వృద్ధి చెందాయి. అందుకే వీటి షేర్లూ అలానే పెరిగాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్... తన చెల్లింపుల్లో తొలిసారి డిఫాల్టయింది ఆగస్టులో. ఆ తరవాత ఐదుసార్లు ఇలాంటి పరిస్థితే వచ్చినా... బయటపెట్టలేదు. అయితే ఈ నెల్లో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) నుంచి కొన్న రూ.300 కోట్ల రుణపత్రాల్ని మ్యూచ్‌వల్ ఫండ్ సంస్థ డీఎస్‌పీ బ్లాక్‌రాక్ కొంత నష్టానికి మార్కెట్లో ఒకేసారి తెగనమ్మేసింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీల విషయంలో భయాలు రేగాయి. పలువురు విశ్లేషకులు... ఇవి చెబుతున్న ఆస్తులకు, వీటి రుణాలకు పొంతన లేదని వ్యాఖ్యానించటంతో పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి మొదలు... ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు పేకమేడల్లా కూలుతున్నాయి. ఇది ఇతర ఆర్థిక సంస్థల షేర్లకూ పాకింది. సూచీలు పతనమవటంతో భయాలు మరింత పెరుగుతున్నాయి. నిజానికి తాము డీఎస్‌పీ బ్లాక్‌రాక్ విక్రయంతో... డీహెచ్‌ఎఫ్‌ఎల్ డిఫాల్ట్ అవుతుందేమోనన్న భయాలు పెరిగాయి. కానీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ వీటిని ఖండిస్తోంది. తమ పరిస్థితి చాలా పటిష్ఠంగా ఉందని చెబుతోంది. ఆ సంస్థ షేరు మాత్రం దాదాపు వారంరోజుల్లో సగానికిపైగానే పతనమైంది. డీఎస్‌పీ కూడా... వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న ఉద్దేశంతో తాము విక్రయించామే తప్ప ఆ సంస్థపై అపనమ్మకంతో కాదని చెబుతోంది. కానీ ఈ షేరు పతనం ఆగటం లేదు. అదే దార్లో పీఎన్‌బీ హౌసింగ్, కెన్‌ఫిన్ హోమ్స్ వంటివీ పతనమవుతున్నాయి.
నిధులు సమీకరించేదిలా...
ఎన్‌బీఎఫ్‌సీలు తమకు కావాల్సిన నిధులను బాం డ్లు, డిబెంచర్లు విక్రయించటం ద్వారా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ద్వారా సమీకరిస్తుంటాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగితే వీటి సమీకరణ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాలు మరింత ప్రియమవుతాయి. అందుకే ఈ షేర్లలో అమ్మకాలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థలు గనక దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే వాటిపై వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దాదాపు 1 శాతం తక్కువకు వస్తాయన్న కారణంతో ఇవి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. ఇపుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కనక వీటికి నిధుల సమీకరణ భారమవుతుంది. నిజానికి ఇక్కడే అసలు సమస్య వస్తుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ... వీటి అప్పుల విలువ పెరిగి, ఆస్తుల విలువ తగ్గుతుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఈ పరిస్థితికి వచ్చేశాయని, ఇదే ఈ షేర్ల పతనానికి అసలు కారణమని మరికొందరు చెబుతున్నారు. ‘‘డీహెచ్‌ఎఫ్‌ఎల్ అప్పుల్లో దాదాపు 12 శాతం మరో మూడు నెలల్లో మెచ్యూరిటీకి రానున్నాయి. వీటికి సంబంధించిన ఆస్తులు మాత్రం 9 శాతమే కావటం గమనార్హం. అంటే మూడునెలల్లో మెచ్యూరిటీకి వచ్చేవాటిలోనే 3 శాతం అప్పులు ఎక్కువగా ఉన్నట్లు లెక్క’’ అని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ తెలియజేసింది. చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఇలా ఆస్తులకన్నా అప్పులు స్వల్పంగా ఎక్కువ ఉన్నవే. పైపెచ్చు ఐఎల్‌ఎఫ్‌ఎస్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తగినంత నిధులు లేవని, అవి ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులివ్వలేవని వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీ... ఏం జరుగుతోంది?
Published Fri, Sep 28 2018 1:04 AM | Last Updated on Fri, Sep 28 2018 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment