
బ్యాంకు డిపాజిట్లలో 65% కుటుంబ ఖాతాదారులవే
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఈ ఏడాది మార్చి నాటికి నమోదైన మొత్తం డిపాజిట్లలో 61.5 శాతం కుటుంబ ఖాతాదారుల నుంచి వచ్చినవేనని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది.
ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఈ ఏడాది మార్చి నాటికి నమోదైన మొత్తం డిపాజిట్లలో 61.5 శాతం కుటుంబ ఖాతాదారుల నుంచి వచ్చినవేనని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 12.8 శాతం వాటాతో ప్రభుత్వం రెండో స్థానంలో ఉంది. కార్పొరేట్ల డిపాజిట్లు 10.8 శాతంగా ఉన్నాయి. గతేడాది మార్చి 31 నాటికి బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.89,72,710 కోట్లు కాగా... అవి 2016 మార్చి 31 నాటికి రూ.98,41,290 కోట్లకు వృద్ధి చెందాయి.
వీటిలో 63.8 శాతం టర్మ్ డిపాజిట్లు. కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు కలిపి 36.2 శాతంగా ఉన్నాయి. డిపాజిట్లలో 70.6 శాతం వాటాతో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా 21.6 శాతంగా ఉంది. మొత్తం డిపాజిట్లలో 51.5 శాతం మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖలు సేకరించినవి కావడం గమనార్హం. ఆ తర్వాత అర్బన్ ప్రాంతాల్లోని శాఖలు 22.8 శాతం సేకరించగా, సెమీ అర్బన్ శాఖల నుంచి వచ్చినవి 15.4 శాతం ఉన్నాయి.