పసిడి పథకాల మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ : పసిడి బాండ్లు (జీబీఎస్), డిపాజిట్లకు (జీఎంఎస్) సంబంధించి ఆవిష్కరించిన రెండు పథకాల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ రెండింటి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆఫీస్ మెమోలో ఆర్థిక శాఖ పేర్కొంది. కరిగింపు చార్జీల వివరాలను కూడా ఇందులో ప్రస్తావించింది. దీని ప్రకారం 100 గ్రాముల పరిమాణం దాకా లాట్‌కు కనీస చార్జి రూ. 500గాను, 900-1,000 గ్రాముల దాకా పరిమాణానికి దాదాపు రూ. 13,400 దాకా ఉంటుంది. కడ్డీలు తదితర భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్‌ను తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెడుతోంది.
జీఎంఎస్ కింద ఏడాది నుంచి 15 ఏళ్ల కాల వ్యవధికి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. మరోవైపు, ఫిజికల్ గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా బాండ్లను (జీబీఎస్) ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇవి 2,5,10, 50, 100 గ్రాముల పరిమాణంలో 5-7 సంవత్సరాల కాలవ్యవధికి లభిస్తాయి.