రుణాల రీషెడ్యూల్‌పై అధికారుల కసరత్తు
ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చల కోసం 4న ముంబైకి పయనం!
హైదరాబాద్: తెలంగాణ రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) అడిగిన సమాచారంతో పాటు, మరింత స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సోమవారం ముంబై వెళ్లనున్నారు. వీరు రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కలిసి, రీ షెడ్యూల్‌పై రిజర్వ్‌బ్యాంకు నుంచి స్పష్టత తీసుకోనున్నారు. తెలంగాణలో 2013 ఖరీఫ్ రుణాలకు మాత్రమే రీ షెడ్యూల్ వర్తింప చేస్తామని రిజర్వ్‌బ్యాంకు ఇదివరకు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇదికూడా 337 మండలాల్లోని రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. బంగారం తాకట్టు రుణా లు, పాత బకాయిలకు సంబంధించి రీ షెడ్యూల్ చేయబోమని.. అది ప్రభుత్వమే చూసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 78 మండలాలను రీ షెడ్యూల్ పరిధిలో చేర్చబోమని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, 337 మండలాల్లో రీ షెడ్యూల్ చేసేచోట పంటల దిగుబడి ఎలా ఉందన్న సమాచారం కూడా ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా రుణాలు రీ షెడ్యూల్ చేసే మండలాల్లో రైతుల రుణాలు నాలుగైదు వేల కోట్లకు మించవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ రీ షెడ్యూల్ చేసినా.. చేయకపోయినా ప్రభుత్వం మాత్రం రుణ మాఫీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
వాస్తవ ఆదాయం ఆధారంగా నిధులు ఇవ్వాలి
14వ ఆర్థిక సంఘం నిధులను వాస్తవ ఆదాయ ఆధారంగా కేటాయించాలని ఆర్థిక శాఖ కోరింది. వ్యాట్ రూపంలో హైదరాబాద్‌కు అధిక ఆదాయం వస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలతో ఏకీభవించరాదని అధికారులు ఆర్థిక సంఘాన్ని కోరారు. తమకు వస్తున్న ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీరెడ్డిని కలిసి వివరించారు.