బ్లాక్‌ అండ్‌ వైట్‌! | Reccipotunnaru more of it with counterfeit banknotes | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ అండ్‌ వైట్‌!

Published Fri, Mar 17 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

బ్లాక్‌ అండ్‌ వైట్‌!

బ్లాక్‌ అండ్‌ వైట్‌!

సిటీ హల్‌చల్‌ చేస్తున్న ‘కరెన్సీ గ్యాంగ్‌లు’
ఆర్బీఐతో లింకులున్నాయంటూ ప్రచారం
ఆ ఆర్డినెన్స్‌ లేకుంటే నామమాత్రపు కేసే
సందట్లో సడేమియా అన్నట్లు నకిలీ, ‘టాయ్‌’గాళ్ళు
వివిధ కేసుల్లో 10 రోజుల్లో 36 మంది అరెస్టు


సిటీబ్యూరో: ఓ వైపు నగరవాసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో డబ్బు దొరక్క ఇబ్బందులు పడుతుండగా... మరోపక్క ‘కరెన్సీ గ్యాంగ్స్‌’ సిటీల హల్‌చల్‌ చేస్తున్నాయి. పాత కరెన్సీ మారుస్తామని కొందరు, నకిలీ నోట్లతో ఇంకొందరు రెచ్చిపోతున్నారు. ఈ రెండూ చాలవన్నట్లు మల్కాజిగిరిలో ఓ వ్యక్తి బొమ్మ కరెన్సీతో ఏకంగా బ్యాంకుకే వెళ్ళి సంచలనం సృష్టించాడు. మొత్తమ్మీద గడిచిన పది రోజుల్లో కరెన్సీ క్రైమ్‌కు సంబంధించి పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.2 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పాత, కొత్త నోట్లతో పాటు టాయ్‌ కరెన్సీలూ ఉన్నాయి.

నెలాఖరుతో ముగియనున్న గడువు...
డీమానిటైజేషన్‌ తర్వాత కేంద్రం పాత నోట్లను మార్చుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చింది. తొలినాళ్ళల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే మార్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆపై ఈ నెల 31 వరకు రిజర్వు బ్యాంక్‌ వద్ద పాత నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. నెలాఖరుతో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ‘నల్లబాబుల’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ తర్వాత పాత కరెన్సీ కలిగి ఉండటం కూడా నేరం. దీంతో నేరుగా ఆర్బీఐకి వెళ్ళి మార్చుకోవడానికి ‘లెక్కలు’ తిప్పలు వచ్చిపడతాయి. దీంతో ఎవరికి వారు తమకు ఉన్న పరిచయాల ఆధారంగా పాత నోట్లను గుట్టచప్పుడు కాకుండా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆర్బీఐతో లింకులున్నాయంటూ...
పాత నోట్లను మార్చిపెడతామంటూ రంగంలోకి దిగుతున్న వారికి భారీ డిమాండ్‌ ఉంటోంది. పాత నోట్ల మొత్తంలో 40 నుంచి 50 శాతం కొత్త నోట్లు ఇస్తామంటూ వీరు హల్‌చల్‌ చేస్తున్నారు. తమకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో లింకులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ చెందిన ‘పాత వాళ్ల’ను సిటీకి రప్పించి భారీ మొత్తాల మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కమీషన్‌ రాయుళ్ళు నిజంగా మార్చడం అనేది జరుగదని పోలీసులు పేర్కొంటున్నారు. కేవలం ఫలానా అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని చెబుతూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తుంటారని, అవకాశం చిక్కితే వారిని మోసం చేయడానికీ వెనుకాడరని స్పష్టం చేస్తున్నారు. డీమానిటైజేషన్‌ ప్రకటన వెలువడిన తర్వాత భారీగా ‘మార్పిడి’ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు.

ఆర్డినెన్స్‌ లేకుంటే నామ్‌కే వాస్తేనే...
ఇలా మార్పిడికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై నగర పోలీసులు అనేక మందిని పట్టుకుంటున్నారు. వాస్తవానికి వీరిపై కేవలం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణతోనే కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. అయితే డీమానిటైజేషన్‌ తర్వాత కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఓ పక్క వీరు దర్యాప్తు చేస్తూనే మరోపక్క భారీ మొత్తం పట్టుబడినప్పుడు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. తాము స్వా«ధీనం చేసుకున్న డబ్బును న్యాయస్థానంలో అప్పగిస్తున్నామని, ఐటీ అధికారులకు అవసరమనుకుంటే కోర్టు ద్వారా తీసుకుంటారని ఓ అధికారి పేర్కొన్నారు.

నకిలీ నోట్లతో రంగంలోకి...
కరెన్సీ కొరత, మార్పిడికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో రూ.2 వేల నకిలీ కొత్త నోట్లతో రంగంలోకి దిగుతున్న ముఠాలు ఉంటున్నాయి. రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసుల బుధవారం అరెస్టు చేసిన ముఠా ఇందుకు నిదర్శనం. కలర్‌ జిరాక్సు ద్వారా నకిలీ రూ.2 వేల నోట్లు తయారు చేసిన ముగ్గురు సభ్యుల ముఠా దాన్ని నాలుగు నెలల పాటు దాచి ఉంచింది. తాజాగా ఏర్పడిన నగదు కొరత, మార్పిడి ముఠాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నకిలీ నోట్లు మార్చేయడానికి రంగంలోకి దిగింది. విషయం వెంటనే ఎస్వోటీకి తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరెన్సీ క్రైమ్‌’ పెరిగిన మాట వాస్తవమేనని పోలీసులే అంగీకరిస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా, సమాచార వ్యవస్థను పటిష్టం చేసి వీరికి చెక్‌ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement