చిన్న సంస్థలకు రుణ నిబంధనల సవరణ
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. దాదాపు రూ. 25 కోట్ల దాకా లోన్ పరిమితులున్న సంస్థల రుణ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. మరోవైపు, వార్షిక ఖాతాల క్లోజింగ్‌కి ముందు రెండు రోజులూ బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. మార్చి 30న పూర్తి రోజు, 31న రాత్రి 8 గం.ల దాకా బ్యాంకులు పనిచేస్తాయని వివరించింది.
పెన్షనర్లకు చెల్లింపుల్లో పక్కాగా నిబంధనలు
పెన్షనర్లకి తప్పుగా చెల్లింపులు/అధిక మొత్తంలో రికవరీ చేసుకోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బ్యాంకులు నిర్దిష్ట నిబంధనలను పక్కాగా పాటించాలని ఆర్‌బీఐ సూచించింది. ఒకవేళ అధిక మొత్తం చెల్లించినట్లు బ్యాంకు దృష్టికి వస్తే.. సత్వరం పెన్షనరు ఖాతాలో ఆ మేరకు సర్దుబాటు చేయాలని పేర్కొంది. అలా పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేయడం సాధ్యం కాకపోతే, మిగిలిన దాన్ని తిరిగి చెల్లించాలని పెన్షనరుకు సూచించాలని ఆర్‌బీఐ తెలిపింది. పెన్షనరు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే భవిష్యత్‌లో వారికి చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా నికరంగా పెన్షనరుకు చెల్లించే దానిలో మూడింట ఒక్క వంతును మాత్రమే మినహాయించుకోవాల్సి ఉంటుంది. పెన్షనరు సమ్మతి తెలియజేస్తే మరింత ఎక్కువ మొత్తం మినహాయించుకోవచ్చు.