రుణాలతో వృద్ధి ప్రమాదమే!
ముంబై: రెండంకెల భారీ వృద్ధి రేటును సాధించాలని పలు వర్గాల నుంచి అందుతున్న సూచనలు, వ్యక్తమవుతున్న అభిలాషలపై రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తీవ్ర హెచ్చరికలు చేశారు. రుణాలను ఆధారం చేసుకుని ‘రెండంకెల వృద్ధి’ని సాధిస్తే... అది పటిష్టంగా నిలబడే అవకాశం ఉండదని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించారు.
ఆసియా సొసైటీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థ తగిన బాటలో పయనించేట్లు వ్యవస్థాపరమైన పటిష్టత ప్రస్తుతం ఆవశ్యకమని చెప్పారు. ఇది దీర్ఘకాల పటిష్ట, సుస్థిర వృద్ధికి దారితీస్తుందని తెలియజేశారు. ‘‘ఒక్కోసారి కొన్ని అసెట్స్‌లోకి రుణ ఆధారిత నిధులు భారీగా రావడం వల్ల 9 నుంచి 10% వృద్ధి రేటు సాధన సాధ్యమవుతుందన్నది నా అభిప్రాయం. అయితే అలాంటి వృద్ధి రేటు దీర్ఘకాలంపాటు నిలబడదు’ అని వివరించారు.