deputy governor Viral Acharya
-
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్‌కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్‌డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్‌కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్‌గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా
ముంబై : ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆర్నెల్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన డిప్యూటీ గవర్నర్‌గా తప్పుకున్నారు. ఆర్థిక సరళీకరణ అనంతరం ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన వారిలో విరాల్ ఆచార్య అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ఆర్బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని గట్టిగా వాదించిన ఆచార్య 2017, జనవరి 23న కేంద్ర బ్యాంక్‌లో చేరారు. కాగా తాను గతంలో పనిచేసిన న్యూయార్క్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం బోధించేందుకు తిరిగి అమెరికా వెళ్లనున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ నిష్క్రమణ తర్వాత కేంద్ర బ్యాంక్‌లో ఆచార్య ఇమడలేకపోయారని చెబుతున్నారు. మరోవైపు ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై గత రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో విరాల్ ఆచార్య విభేదించారు. -
రుణాలతో వృద్ధి ప్రమాదమే!
ముంబై: రెండంకెల భారీ వృద్ధి రేటును సాధించాలని పలు వర్గాల నుంచి అందుతున్న సూచనలు, వ్యక్తమవుతున్న అభిలాషలపై రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తీవ్ర హెచ్చరికలు చేశారు. రుణాలను ఆధారం చేసుకుని ‘రెండంకెల వృద్ధి’ని సాధిస్తే... అది పటిష్టంగా నిలబడే అవకాశం ఉండదని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించారు. ఆసియా సొసైటీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థ తగిన బాటలో పయనించేట్లు వ్యవస్థాపరమైన పటిష్టత ప్రస్తుతం ఆవశ్యకమని చెప్పారు. ఇది దీర్ఘకాల పటిష్ట, సుస్థిర వృద్ధికి దారితీస్తుందని తెలియజేశారు. ‘‘ఒక్కోసారి కొన్ని అసెట్స్‌లోకి రుణ ఆధారిత నిధులు భారీగా రావడం వల్ల 9 నుంచి 10% వృద్ధి రేటు సాధన సాధ్యమవుతుందన్నది నా అభిప్రాయం. అయితే అలాంటి వృద్ధి రేటు దీర్ఘకాలంపాటు నిలబడదు’ అని వివరించారు. -
మెరుగైన పనితీరుకు కృషి చేస్తా
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య న్యూఢిల్లీ: అప్పగించిన బాధ్యతలను అత్యుత్తమ పనితీరుతో నిర్వర్తించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైన విరాళ్ ఆచార్య తెలిపారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న విరాళ్ ఆచార్య.. మూడు సంవత్సరాల పాటు ఈ హోదాలో ఉంటారు. ద్రవ్యపరపతి విధానం, పరిశోధన విభాగాలను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎన్‌వైయూ–స్టెర్న్)లోని ఆర్థిక విభాగంలో సీవీ స్టార్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ముంబై ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ఆచార్య.. 1995లో బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివారు. 2001లో ఎన్‌వైయూ–స్టెర్న్ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 2001–08 మధ్య కాలంలో లండన్ బిజినెస్ స్కూల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనకు స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు ఆచార్య. రాజన్‌తో కలసి మూడు పరిశోధన పత్రాలు కూడా రాశారు.’సార్వభౌమ రుణం, ప్రభుత్వ హ్రస్వదృష్టి, ఆర్థిక రంగం’, ’కంపెనీల అంతర్గత గవర్నెన్స్’, ’క్రియాశీలక పరిస్థితుల్లో రుణభారం, ప్రభుత్వ హ్రస్వదృష్టి’ పేరిట ఆయన పరిశోధన పత్రాలు రూపొం దించారు. ఆర్థిక రంగానికి వ్యవస్థాగతంగా ఎదురయ్యే రిస్కులు, నియంత్రణ, ప్రభుత్వ జోక్యంతో తలెత్తే సమస్యలు మొదలైన అంశాలపై ఆచార్య పరిశోధనలు చేశారు. కేంద్రీయ బ్యాంకులు ఒకవైపు ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే... రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించాలన్నది ఆయన అభిప్రాయం. -
ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య
మూడేళ్ల పాటు పదవీ కాలం ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ విరాళ్ ఆచార్య తాజాగా రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆచార్య (42) మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదోన్నతి పొందినప్పట్నుంచీ డిప్యూటీ గవర్నర్ స్థానం ఒకటి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు (ఎస్ఎస్ ముంద్రా, ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్ గాంధీలు) ఉన్నారు. డీమోనిటైజేషన్ దరిమిలా రిజర్వ్ బ్యాంక్ పూటకో నిబంధన మార్చేస్తూ, తీవ్ర విమర్శల పాలవుతున్న తరుణంలో ఆచార్య నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎన్‌వైయూ–స్టెర్న్)లోని ఆర్థిక విభాగంలో సీవీ స్టార్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.ముంబై ఐఐటీ విద్యార్థి అయిన ఆచార్య.. 1995లో బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివారు. 2001లో ఎన్‌వైయూ–స్టెర్న్ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 2001–08 మధ్య కాలంలో లండన్ బిజినెస్ స్కూల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. భారతీయ క్యాపిటల్ మార్కెట్స్పై ఎన్ఎస్ఈ–ఎన్‌వైయూ స్టెర్న్ చేపట్టిన అధ్యయనానికి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ‘పేదల రఘురామ్ రాజన్’... ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనకు స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు ఆచార్య. అంతే కాదు.. తనను తాను పేదల రఘురామ్ రాజన్‌గా అభివర్ణించుకుంటారు. 2013లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా దీని వెనుక గల కథను ఆయన వివరించారు. తానొకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బ్యాంకింగ్, సంక్షోభాలు మొదలైన వాటికి సంబంధించి తన చేతిలో ఉన్న పత్రాలను చూసి తోటి ప్రయాణికుడు తనను రఘురామ్ రాజన్‌గా భావించారని ఆచార్య పేర్కొన్నారు. ’దీంతో రాజన్‌ను రోల్ మోడల్‌గా తీసుకుని, ఆయన సాధించిన దానిలో కనీసం 5–10 శాతం సాధించగలిగినా.. విమాన ప్రయాణాల్లో ’పేదల రఘురామ్ రాజన్’గా చలామణి అయిపోవచ్చని ఆరోజు గ్రహించాను’ అని ఆచార్య చమత్కరించారు. తన రోల్ మోడల్ రాజన్‌తో కలిసి ఆయన గతంలో మూడు పరిశోధన పత్రాలు రాశారు. ’సార్వభౌమ రుణం, ప్రభుత్వ హ్రస్వదృష్టి, ఆర్థిక రంగం’, ’కంపెనీల అంతర్గత గవర్నెన్స్’, ’క్రియాశీలక పరిస్థితుల్లో రుణభారం, ప్రభుత్వ హ్రస్వదృష్టి’ పేరిట ఆయన ఈ పరిశోధన పత్రాలు రూపొందించారు. రాజన్ తరహాలోనే కేంద్రీయ బ్యాంకుల స్వతంత్రత కాపాడాలన్నది ఆచార్య అభిప్రాయం. కేంద్రీయ బ్యాంకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అంటారాయన. న్యూయార్క్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని ఆచార్య ప్రొఫైల్ ప్రకారం.. ఆర్థిక రంగానికి వ్యవస్థాగతంగా ఎదురయ్యే రిస్కులు, నియంత్రణ, ప్రభుత్వ జోక్యంతో తలెత్తే సమస్యలు మొదలైన అంశాలపై ఆచార్య పరిశోధనలు చేశారు. ప్రభుత్వ బ్యాంకులకు ‘ఆచార్య’ ఔషధం? ఆచార్యకు భారత బ్యాంకింగ్ వ్యవస్థపై అపార అవగాహన ఉంది. బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించిన బాసెల్ 3 నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాదించే వర్గాలకు ఆచార్య నియామకం రుచించకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను సరిదిద్దాలని, బాసెల్ నిబంధనలు మరింత కఠినతరంగా ఉండాలని ఆచార్య ఒక పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ’ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్కువగా రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరిగా గణనీయంగా మూలధనం సమకూర్చుకోవాలి లేదా తమ మూలధనానికి తగ్గట్లుగా అసెట్స్ అయినా తగ్గించుకోవాలి’ అని ఆయన వివరించారు. 2015లో రాజన్ నిర్వహించిన అసెట్ క్వాలిటీ సమీక్ష అనేది నిజానికి ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆచార్య వ్యాఖ్యానించారు. ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా మెరుగైన ప్రైవేట్ బ్యాంకుల్లో విలీనం చేయడం, ఆటోమేటిక్‌గా మూలధనం సమకూర్చడం, డిపాజిట్ బీమా పథకం ప్రవేశపెట్టి బ్యాంకుల రిస్కులను మదింపు చేయడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. బాసెల్ వంటి నిబంధనలు ఒక్కో బ్యాంకు పాటించాల్సిన నిబంధనలే సూచిస్తున్నాయే తప్ప పూర్తి వ్యవస్థను పటిష్టం చేసేవిగా లేవన్నది ఆచార్య అభిప్రాయం. ఫలితంగా ఒక్కో బ్యాంకు దేనికదే రిస్కులను పరిమితం చేసుకునే చర్యలు తీసుకున్నా .. పెను సంక్షోభాలేవైనా వచ్చినప్పుడు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు రిస్కులు తప్పకపోవచ్చని ఆయన అంటారు. రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన నియామకంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల పర్వం మొదలవుతుందన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి.