మెరుగైన పనితీరుకు కృషి చేస్తా
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య
న్యూఢిల్లీ: అప్పగించిన బాధ్యతలను అత్యుత్తమ పనితీరుతో నిర్వర్తించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైన విరాళ్ ఆచార్య తెలిపారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న విరాళ్ ఆచార్య.. మూడు సంవత్సరాల పాటు ఈ హోదాలో ఉంటారు. ద్రవ్యపరపతి విధానం, పరిశోధన విభాగాలను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎన్‌వైయూ–స్టెర్న్)లోని ఆర్థిక విభాగంలో సీవీ స్టార్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ముంబై ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ఆచార్య.. 1995లో బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివారు. 2001లో ఎన్‌వైయూ–స్టెర్న్ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
2001–08 మధ్య కాలంలో లండన్ బిజినెస్ స్కూల్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనకు స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు ఆచార్య. రాజన్‌తో కలసి మూడు పరిశోధన పత్రాలు కూడా రాశారు.’సార్వభౌమ రుణం, ప్రభుత్వ హ్రస్వదృష్టి, ఆర్థిక రంగం’, ’కంపెనీల అంతర్గత గవర్నెన్స్’, ’క్రియాశీలక పరిస్థితుల్లో రుణభారం, ప్రభుత్వ హ్రస్వదృష్టి’ పేరిట ఆయన పరిశోధన పత్రాలు రూపొం దించారు. ఆర్థిక రంగానికి వ్యవస్థాగతంగా ఎదురయ్యే రిస్కులు, నియంత్రణ, ప్రభుత్వ జోక్యంతో తలెత్తే సమస్యలు మొదలైన అంశాలపై ఆచార్య పరిశోధనలు చేశారు. కేంద్రీయ బ్యాంకులు ఒకవైపు ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే... రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించాలన్నది ఆయన అభిప్రాయం.