
గ్రామీణ పోస్టాఫీసులు ఇక మినీ ఏటీఎంలు
- హ్యాండ్ హెల్డ్ డివైస్‌ల ద్వారా నగదు చెల్లింపులు
- తెలంగాణ, ఏపీల్లో ఏప్రిల్ చివరి నాటికి 2 వేల గ్రామాల్లో అందుబాటులోకి..
- ‘సాక్షి’తో భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు ఏటీఎంల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించాయి. తపాలా శాఖ మాత్రం అన్ని గ్రామాల్లోని తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను అందుబాటులోకి తెచ్చి వాటిని మినీ ఏటీఎంలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు రిజర్వ్ బ్యాంకు కూడా అనుమతివ్వడంతో ఈ నెల చివరి నాటికే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
ఈ నెలాఖరునాటికి దేశవ్యాప్తంగా 24 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్‌ల ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి 2 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. త్వరలో ఆ సంఖ్య 13 వేలకు చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే....
దేశవ్యాప్తంగా 13 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలకు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను సమకూర్చబోతున్నాం. ఇప్పుడు కొన్ని పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అవి కేవలం పోస్టాఫీసుల్లో ఖాతా ఉన్నవారు మాత్రమే నగదు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. వాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే డివైస్‌ల నుంచి ఎవరైనా నగదు పొందవచ్చు. తపాలా కార్యాలయాల పనివేళల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది. తొలుత రూ.5 వేల వరకు నగదు పొం దవచ్చు. ఆ తర్వాత పెంచుతాం.
అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు నిల్వలు సిద్ధం చేస్తున్నాం. ఏటీఎం కార్డుతో వచ్చే వారు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లో స్వైప్ చేస్తే అక్కడున్న సిబ్బంది డబ్బు అందిస్తారు. తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉన్న వారికి ఎలాంటి రుసుములు ఉండవు, బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఒక్కో విత్‌డ్రా యల్‌కు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఖాతాదారు నుంచి కాకుండా సంబంధిత బ్యాంకు నుంచి వసూలు చేస్తాం. తపాలా కార్యాలయాలతో గ్రామాల్లోని దుకాణాలను అనుసంధానం చేసి నగదు రహిత లావాదేవీలు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.