
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ .. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఉండకపోవచ్చేమో కానీ.. ఈ పదవికి మాత్రం ఆయన అన్నివిధాలా సరైన అభ్యర్థే అంటోంది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మ్యాగజైన్ బారన్స్. ఈ మేరకు అది ఓ కథనాన్ని ప్రచురించింది. ‘స్పోర్ట్స్ జట్లు ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా అత్యంత సమర్థులను తీసుకోగా లేనిది.. సెంట్రల్ బ్యాంక్‌లు సమర్థుల్ని ఎందుకు రిక్రూట్ చేసుకోకూడదు?‘ అని ప్రశ్నించింది.
ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చూడటంతో పాటు కరెన్సీకి స్థిరత్వం తెచ్చి, స్టాక్స్ ధరలు యాభై శాతం ఎగిసేలా చర్యలు తీసుకున్న సెంట్రల్ బ్యాంకుల సారథుల జాబితాలో స్టార్‌గా రాజన్‌ను అభివర్ణించింది. క్రెడిట్ డెరివేటివ్స్‌లో భారీ రిస్కుల వల్ల ఆర్థిక సంక్షోభం రాబోతోందంటూ... ముందుగానే కచ్చితమైన హెచ్చరికలు చేసిన ఒకే ఒక్కరు రాజన్ అని బారన్స్ కితాబిచ్చింది. అయితే, ఫెడ్ చైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్న అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడం విచారకరమని పేర్కొంది.
కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఇతర దేశస్తులు సైతం నేతృత్వం వహించిన దాఖలాలు ఉన్నాయని బారన్స్ పత్రిక తెలియజేసింది. కెనడాకి చెందిన మార్క్ కార్నీ.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కి సారథ్యం వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపించింది. ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ పదవీకాలం వచ్చే ఏడాది తొలినాళ్లలో ముగియనుండటంతో ఆమె స్థానంలో కొత్త చైర్మన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రకటించవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బారన్స్ తాజా కథనం ప్రాథాన్యాన్ని సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment