
తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వలేం
న్యాయపరమైన చిక్కులే కారణం: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఇతరత్రా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల్లో జరిపిన తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిరాకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. సమాచారాన్ని పంచుకోవడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఆర్‌బీఐ వాదన. అయితే, నల్లధనం, ఇతర ఆర్థికపరమైన నేరాలకు అడ్డుకట్టవేయాలంటే నో యువర్ కస్టమర్(కేవైసీ), మనీలాండరింగ్ నిరోధ చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘనలపైనే అధికంగా దృష్టిపెట్టాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంటోంది.
సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ)కు ఫెమా ఉల్లంఘనల వివరాలను ఇచ్చేందుకు ఆర్‌బీఐ గతంలో హామీనిచ్చిందని.. ఇప్పుడు సమాచారం ఇవ్వడానికి ముందుకురావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)... తనకు అవసరమైన సమాచారాన్ని సీఈఐబీ నుంచే తీసుకుంటుంది.
బ్యాంకుల్లో తనిఖీ నివేదికలను ఆర్‌బీఐ తమతో పంచుకోవడం లేదన్న విషయాన్ని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్(ఈఐసీ) సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఈఐబీ చీఫ్ ఈ విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈఐబీ అనేది చట్టపరమైన సంస్థ కాదని.. తనికీ నివేదికలను ఇవ్వడంవల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ఆర్‌బీఐ చెబుతోందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదాయపు పన్ను(ఐటీ) విభాగానికి కూడా ఆర్‌బీఐ నుంచి తగిన సహకారం అందడం లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం. కేైవైసీ నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకులపై ఆర్‌బీఐ విధించిన జరిమానాలకు సంబంధించి ఐటీ శాఖకు వివరాలు ఇచ్చేందుకు ఆర్‌బీఐ నిరాకరించడాన్ని సీబీడీటీ ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ఈ సమాచారం ఇవ్వడం అనేది తమ నిబంధనలకు విరుద్ధమని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది.