ఇతర బ్యాంకుల మెషీన్ల్లలోనూ క్యాష్ డిపాజిట్‌కు ఆర్‌బీఐ అనుమతి!
కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంల నెట్‌వర్క్ అయిన జాతీయ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్‌ఎఫ్‌ఎస్)లో భాగంగా ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ప్రతిపాదన చేసిందని, ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ద్వారా కొన్ని షరతులపై సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ కోసం చేసిన ప్రతిపాదనలపై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎంఎస్)లో జరిపే ఒక లావాదేవీకి రూ.49,999లు పరిమితి విధించినట్టు చెప్పారు.
బ్యాంకుల్ని పటిష్టపరుస్తాం..
ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయడంపై కేంద్రం దృష్టిని సారించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. భారతీయ మహిళా బ్యాంకు సహా చిన్నతరహా బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే ప్రతిపాదనలపై ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజు, జ్యోతి ధృవే, భగవంత్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
మరిన్ని అంశాలు...
⇒ ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌సహా దాదాపు 14 సంస్థలపై కంపెనీల చట్ట నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
⇒ భారత్‌లో దాదాపు 8,354 విదేశీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వీటిలో కొన్ని కంపెనీలకు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా పన్ను బకాయిలు ఉన్నాయని, ఆయా కంపెనీలపై తగిన చర్యలు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోందని ఆర్థికశాఖ సహాయమంతిర జయంత్ సిన్హా తెలిపారు.
⇒ కాగా మరో ప్రశ్నకు సిన్హా సమాధానం చెబుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధన మద్దతు కేంద్రం అందిస్తుందని వివరించారు. మార్కెట్ నుంచి సైతం నిధుల సమీకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
⇒ 2012 నుంచి రక్షణ రంగంలోకి దాదాపు 13 లక్షల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు రక్షణశాఖ సహాయమంత్రి రావు లలిత్‌జిత్ సింగ్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.