మినిమమ్‌ బాదుడు | minimum balance in bank account special story | Sakshi
Sakshi News home page

మినిమమ్‌ బాదుడు

Published Mon, Sep 25 2017 10:22 AM | Last Updated on Mon, Sep 25 2017 8:10 PM

minimum balance in bank account  special story

ఆమధ్య బ్యాంకులు ఖాతాదారుల మీద రకరకాల రుసుముల మోత మోగించిన తర్వాత సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ జోకు చాలామందికి గుర్తుండే ఉంటుంది.. తన అకౌంట్‌ ఉన్న బ్యాంకు వైపు మామూలుగా చూసేసరికి ఇరవై రూపాయలు కట్‌ అయిపోయాయంటూ ఓ వ్యక్తి తన మిత్రుడితో చెప్పి వాపోతున్నట్టు ఉన్న ఆ జోకు అందరినీ నవ్వించడమే కాదు.. బ్యాంకుల ఘనత గురించి ఆలోచింపజేసింది కూడా. బ్యాంకులు ఇప్పుడు వసూలు చేస్తున్న రుసుములు, పెనాల్టీల తీరు చూస్తూ ఉంటే ఈ జోకు ఎంత సత్యమో తేలిగ్గానే అర్థమవుతుంది.

సాక్షి, విశాఖపట్నం :
సుబ్బారావు ఓ షాపింగ్‌ మాల్‌లో చిరుద్యోగి. అతనికొచ్చే నెలసరి వేతనం రూ.10 వేలు. దాంట్లో నాలుగువేలు అద్దెలకే పోతాయి.మిగిలిన జీతం సొమ్ముతో గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. మొదటి వారానికే బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. మళ్లీ ఫస్ట్‌ వరకు ఎదురు చూపులే. కానీ బ్యాంకులో జీతం జమ అయ్యే సరికి రూ.200 కోత పడుతుంది. ప్రతీ నెలా ఈ తంతు జరుగుతూ ఉండేసరికి ఇదేమిటని సుబ్బారావు బ్యాంకు మేనేజర్‌ను ఆరాతీస్తే ఖాతాలో కనీస మొత్తంగా రూ. 5 వేలు ఉంచడం లేదు కాబట్టి పెనాల్టీ తప్పడం లేదని చెప్పడంతో సుబ్బారావుకు ప్రాణం ఉసూరనిపించింది.

సూర్యనారాయణ చిరు వ్యాపారి. ఈయనకు ప్రతి నెలా పెట్టుబడి, ఖర్చులు పోనూ రూ.15 వేల వరకు మిగులుతుంది. కానీ అవసరానికి ఆ మొత్తం తీసుకుందామంటే సొంత బ్యాంకు ఏటీఎంలు పనిచేయక చాలా ఇబ్బంది అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే ఏదోబ్యాంకు ఏటీఎం నుంచి తనకు కావాల్సిన మొత్తాన్ని తీయడం అనివార్యమవుతుంది. అయితే మూడు కంటే ఎక్కువ సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేస్తున్నారన్న కారణంతో సొమ్ము తీసిన ప్రతిసారీ రూ. 20 వంతున ఖాతా నుంచి ఫీజు మళ్లిపోతోంది.

ఇవి సామాన్యుల తిప్పలు. సగటు మానవులకు ఎదురవుతున్న ఇక్కట్లు. అయితే ఇలాటి ఖాతాదారులే ఎక్కువమంది ఉండడంతో బ్యాంకుల పంట పండుతోంది. పెద్ద మొత్తంలో సొత్తు దాఖలు పడుతోంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు విధించిన ఆంక్షలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలిచాలని జీతంతో కుటుంబపోషణే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలో ఏకంగా ఐదువేలు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచాలంటే ఎలా? అన్నది సామాన్యుల సమస్యగా ఉంది.

స్వల్ప ఆదాయమే అధికం
జిల్లా జనాభా 43.66 లక్షలయితే, మొత్తం 14 లక్షల కుటుంబాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీరిలో 31,209 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 70,239 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో 47,818 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మరో 11,044 మంది పని చేస్తున్నారు. ఎంప్లాయింట్‌మెంట్‌ ఎక్సే్ఛంజి లెక్కల ప్రకారం ప్రైవేటు రంగంలో 49,689 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కానీ అన«ధికారికంగా ప్రైవేటు సెక్టార్‌లో అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నాలుదైదు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆదాయం రూ.5వేల నుంచి 8వేలు కాగా, 50 శాతం ఆదాయం రూ.8వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. మిగిలిన 20 శాతం మంది ఆదాయం రూ.15 వేలకు పైబడి ఆర్జిస్తున్నారు. చిరు వ్యాపారులు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపే.

జిల్లాలో 45 బ్యాంకుల పరిధిలో 707 బ్రాంచ్‌లుంటే వాటిలో 186 బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లా జనాభాలో బ్యాంకు ఖాతాలున్న వారి సంఖ్య 38లక్షల వరకు ఉంది. బ్యాంకుల్లో 64.54 లక్షల ఖాతాలున్నాయి. జన్‌ధన్‌ యోజన ఖాతాలు రూ.9.27లక్షలు కాగా, ఖాతాల్లేని వారి సంఖ్య 8లక్షల వరకు ఉంది. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల పరిధి లో రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రైవేటు సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు చిరు వ్యాపారులు పూర్తిగా బ్యాంకులు, ఏటీఎంలపై ఆధారపడే లావాదేవీలు జరుపు తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేటు సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగుల కంటే చిరుద్యోగులు..చిరు వ్యాపారాలు జరిపే లావాదేవీలే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు అవసరమైన మేరకు మాత్రమే విత్‌ డ్రా చేస్తుంటారు. కానీ చిరుద్యోగులు తమకు వచ్చిన వేతనమంతా విత్‌డ్రా చేసి నెలవారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటుంటారు.

మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిర్వహించని కారణంగా ఆ పొదుపు ఖాతాలనుంచి జూన్‌ నెలాఖరు నాటికి ఏకంగా రూ.235.06కోట్లు పెనాల్టీ రూపంలో వసూలు చేసినట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం రూ.2వేల కోట్లు దాటుతుందని ప్రకటించింది. ఒక్క ఎస్‌బీఐకే పెనాల్టీ రూపంలో ఇంతపెద్ద మొత్తంలో ఆదాయం వస్తే..ఇతర బ్యాంకులన్నీ కలుపు కుంటే ఈమొత్తం ఐదువేల కోట్లకుపైగానే ఉంటుందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో ఈ విధంగా పెనాల్టీల రూపంలోనే బ్యాంకులు వసూలు చేసిన మొత్తం రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందులో గరిష్ట భాగం సామాన్యులదేనని చెప్పనక్కర్దేదు. బ్యాంకుల పెనాల్టీ దోపిడీపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఆంక్షలను ఎత్తివేయాలని.. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్న వారంతా ఈ ఆంక్షల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవు తున్నారని వాపోతున్నారు. అయితే తాము ఆర్‌బీఐ ఆదేశాల మేరకు వసూలు చేస్తున్నామని.. బ్యాంకుల ప్రమేయం ఏమాత్రం లేదని లీడ్‌ బ్యాంకు అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement