కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు...
2005 ముందునాటి నోట్లపై జూన్ 30 తాజా డెడ్‌లైన్
ముంబై: 2005కు పూర్వం ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఉద్దేశించిన గడువును రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) వచ్చే ఏడాది జూన్ 30 దాకా పొడిగించింది. వాస్తవానికి ఇది జనవరి 1తో ముగిసిపోవాల్సి ఉంది. రూ.500, రూ.1,000 సహా వివిధ మారకం విలువల కరెన్సీ నోట్లను జూన్ 30 దాకా పూర్తి విలువకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను చలామణీలో నుంచి ఉపసంహరించే దిశగా వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడంగానీ అందుబాటులో ఉన్న బ్యాంకుల శాఖల్లో గానీ ప్రజలు మార్చుకోవచ్చని ఆర్‌బీఐ సూచించిన సంగతి తెలిసిందే.
ఈ రకంగా సింహ భాగం పాత నోట్లను ఇప్పటికే చలామణీలో నుంచి ఉపసంహరించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అదనపు భద్రతా ఫీచర్లతో ముద్రిస్తున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు దాదాపు దశాబ్దం నుంచి చలామణీలో ఉండటం వల్ల పాత నోట్ల ఉపసంహరణతో ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడం కొనసాగిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. 2005కి పూర్వం నోట్లకు వెనుకవైపున వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. నకిలీ కరెన్సీకి చెక్ చెప్పే ఉద్దేశంతో ఆ తర్వాత నుంచి అదనపు భద్రతా ప్రమాణాలు జోడించడంతోపాటు ముద్రణ సంవత్సరాన్నీ నోట్లపై ముద్రిస్తున్నారు.
పాత నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు పెట్టాక రూ. 52,855 కోట్ల విలువ చేసే 144.66 కోట్ల నోట్లను ఆర్‌బీఐ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇందులో రూ.100 మారకం విలువగల నోట్లు 73.2 కోట్లు, రూ.500 నోట్లు 51.85 కోట్లు, రూ. 1,000 నోట్లు 19.61 కోట్లు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయ్యాల్లో ధ్వంసం చేయడం జరిగింది. 2005కి పూర్వం ముద్రించిన సిరీస్ నోట్లను శాఖల్లో గానీ ఏటీఎంల ద్వారా గానీ, జారీ చేయొద్దంటూ ఇప్పటికే బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ చర్యలతో ప్రస్తు తం చెలామణీలో ఉన్న పాత నోట్ల సంఖ్య స్వల్పం గానే ఉంటుందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.