జనవరి 1 వరకు ‘ఆ నోట్లు’ మార్చుకోవచ్చు
ముంబై: 2005 నాటికన్నా ముందు ముద్రించిన రూ.500, రూ. 1000 సహా అన్ని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు 2015, జనవరి 1 వరకు గడువును పెంచుతూ రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. నోట్లను మార్చుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించరాదని, పాతనోట్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా నోట్లను మార్చుకునే వ్యక్తి సదరు బ్యాంకు ఖాతాదారుడే కానవసరం లేదని, ఒకే సమయంలో ఎన్ని నోట్లనైనా మార్చుకునేందుకు అనుమతించాలని, ఈ క్రమంలో ఎలాంటి రుసుములూ విధించరాదని బ్యాంకులకు నిర్దేశించింది. అదేసమయంలో చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లోని వారు నోట్లు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక నోట్ల ఎక్సేంజ్ మేళాను ఏర్పాటు చేయాలని సూచించింది.
అదేసమయంలో ప్రజలు ఆయా నోట్లను తమ వ్యాపార, ఇతర లావాదేవీలకు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, జనవరి 22 నాటి తమ విజ్ఞప్తికి స్పందించిన ప్రజలు ఇప్పటికే వారి వద్ద ఉన్న పాత నోట్లను అత్యధిక భాగం మార్చుకున్నారని, కొద్ది మొత్తంలో మాత్రమే 2005కు పూర్వం నాటి నోట్లు(రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.1000) ప్రజల వద్ద ఉన్నాయని బ్యాంకు తెలిపింది.