మూడు కంటైనర్లలో భారీగా నోట్ల కట్టలు
మూడు కంటైనర్లలో భారీగా నోట్ల కట్టలు
Published Wed, Oct 26 2016 7:16 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
తమిళనాడులోని ఈరోడ్ తదితర జిల్లాల్లోని బ్యాంకుల నుంచి సేకరించిన కరెన్సీని చెన్నైలోని రిజర్వుబ్యాంకులో అప్పగించేందుకు కోట్లాది రూపాయలతో బయలుదేరిన మూడు కంటైనర్లు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు మూడు కంటైనర్ లారీలు కోయంబత్తూరు నుంచి బయలుదేరగా కోయంబత్తూరు సహాయ కమిషనర్ మురుగస్వామి నేతృత్వంలో సాయుధ పోలీసులు బందోబస్తుగా ఆరు కార్లలో ముందు వెనుక అనుసరించారు. ఈ కంటైనర్లు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విల్లుపురం జిల్లా ఉలుందూర్‌పేటకు చేరుకున్నాయి. ఉలుందూర్‌పేట టోల్‌గేట్ సమీపంలోని ఒక హోటల్ ముందు మూడు కంటైనర్లను నిలిపి సిబ్బంది, పోలీసులు భోజనం చేశారు.
ఆ సమయంలో ఉలుందూర్‌పేట సీఐ సూరయ్య నాయకత్వంలో 50మంది పోలీసులు ఆ కంటైనర్లకు బందోబస్తుగా నిలవడంతో ప్రజలు ఆసక్తిగా గుమికూడారు. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మూడు కంటైనర్లలో కరెన్సీని తరలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల క్రితం వివిధ బ్యాంకుల వారు సేలం నుంచి చెన్నైకి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా భారీ ఎత్తున కరెన్సీని చెన్నైలోని రిజర్వు బ్యాంకుకు పంపుతుండగా ఆ రైలు బోగీపై కన్నం వేసి రూ.5.75 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించినా ఇప్పటికీ నిందితుల ఆచూకీ తెలియలేదు. దీంతో రోడ్డు ప్రయాణమే మేలని భావించిన బ్యాంకు అధికారులు కంటైనర్ల ద్వారా కరెన్సీని తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement