ఆ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు | Pre-2005 currency notes can be exchanged at any bank: RBI | Sakshi
Sakshi News home page

ఆ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు

Published Mon, Mar 17 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

ఆ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు

ఆ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల మార్పిడిపై ఎలాంటి అనుమానాలకూ తావులేకుండా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 2005కు ముందునాటి రూ. 500, 1000 సహా అన్ని కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది జనవరి 1 వరకూ ఏ బ్యాంకు బ్రాంచీల్లోనైనా మార్పిడి చేసుకోవచ్చని, ఇందుకు ప్రజలను సహకరించాల్సిందిగా బ్యాంకులకు సూచించింది. మార్పిడి విషయంలో నోట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితీ లేదని, ఎన్ని నోట్లనైనా మార్చుకోవచ్చని పేర్కొంది.

 మరిన్ని భద్రతా ప్రమాణాలతో కూడిన కరెన్సీ నోట్లను చలామణీలో ఉంచేందుకు వీలుగా 2005కు ముందు నోట్లను ఉపసంహరించాలని ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ మార్పిడికి ఈ ఏడాది జూన్ 30 వరకూ గడువు ఇవ్వగా.. దీన్ని తర్వాత 2015, జనవరి 1వరకూ పొడిగించింది. కాగా, ఈ తేదీ తర్వాత మాత్రం పదికి మించి రూ.500/1,000 నోట్లను మార్చుకోవాలంటే ప్రజలు తమ గుర్తింపు(ఐడెంటిటీ)ను సమర్పిం చాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గదర్శకాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించేందుకు ఆర్‌బీఐ తాజాగా కొన్ని వివరణలను ఇచ్చింది. దీనిలో భాగంగానే తమ బ్యాంక్ కస్టమర్ అయినా, కాకపోయినా ప్రజలందరి నుంచీ బ్యాంకులన్నీ నోట్ల మార్పిడికి వీలుకల్పించాలని పేర్కొంది.

అంతేకాకుండా క్యాష్ కౌంటర్లు లేదా ఏటీఎంలలో కూడా 2005కు ముందునాటి నోట్లు జారీకాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్‌బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. బ్యాంకుల వద్దనున్న ఈ 2005కు ముందు నోట్లను తమకు పంపించేయాలని సూచించింది. మరో ముఖ్యవిషయం... ప్రజలు ఈ నోట్లను అన్నిరకాల లావాదేవీలకూ ఉపయోగించుకోవచ్చని, చట్టబద్ధంగా వీటి చెల్లుబాటు కొనసాగుతుందని కూడా ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. నోట్ల మార్పిడి ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొంది.

 2005 ముందునాటి నోట్లను సులువుగా గుర్తించవచ్చు. ఈ నోట్ల వెనుకవైపు కింది బాగంలో ఎలాంటి ముద్రణ సంవత్సరం ఉండదు. 2005 తర్వాత నోట్లపై మాత్రం అది ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ప్రధానంగా నకిలీ కరెన్సీకి అడ్డుకట్టవేయడం కోసం అదనపు భద్రతా ప్రమాణాలను వీటికి జతచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement