Old currency notes
-
రూ.లక్షకు.. రూ.5లక్షలు
మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్ మదార్ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మదార్ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సాక్షి, వేంసూరు(ఖమ్మం) : మర్లపాడులో పాత కరెన్సీ డంపును ఏర్పాటు చేసి కొత్త నోట్లకు పాత నోట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్న షేక్ మాదార్ ముఠా గుట్టు విప్పారు పోలీసులు. మర్లపాడులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేష్ మాట్లాడారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మాదర్ ముఠాకు చెందిన వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామంటూ.. మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామోదర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గదిలో చెలమణిలో లేని (పాత) రూ.500,1000 నోట్లను కంటెయినర్ తరహాలో అమర్చి.. తన వద్ద రూ.కోట్ల పాత నోట్లు ఉన్నాయని.. కొత్త నోట్లు రూ.లక్ష ఇస్తే.. ఐదు రెట్లు పాత నోట్లు ఇస్తానని, వీటిని ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఉందని నమ్మించేవాడు. తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని నమ్మించడానికి నోట్ల కట్టల మధ్యలో డమ్మీ నోట్లు ఉంచి ఆ నోట్ల కట్టలను వీడియో తీసి ఆశ చూపి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. మదార్‌పై గతంలో వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. పంటరుణాలు ఇస్తామంటూ రైతులను.. భూమి పాసు పుస్తకం జిరాక్స్, రూ.5 లక్షలు ఇస్తే తాము పంటరుణంగా ఉన్న భూమిని బట్టి రూ.10 నుంచి 40 లక్షల వరకు ఇస్తానని, రైతులను నమ్మించేందుకు తాను గదిలో దాచుకున్న పాత నోట్ల కట్టల డంపును చూపేవాడని, అధిక మొత్తం రుణం వస్తుందనే నమ్మకంతో రైతులు అడిగినంత ఇస్తే.. తరువాత అడ్రస్ లేకుండా పోయి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రూ.28లక్షలకు రూ.కోటి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఉండేటి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.28లక్షలు తీసుకొని దానికి బదులుగా రూ.కోటి ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు మదార్, వేంసూరు మండలం చౌడవరం గ్రామానికి చెందిన గాయం వెంకటనారాయణ, దమ్మపేట మండలం గండుగుల పల్లికి చెందిన తోట హనుమంత్‌రావులపై ఆర్బీఐ ఎస్బీఎన్ యాక్ట్ 420 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ యాక్ట్ కింద జిల్లాలో ఇదే తొలి కేసు అని చెప్పారు. కార్యక్రమంలో సత్తుపల్లి సీఐ రమాకాంత్, సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, వేంసూరు ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. -
ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాలు.. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీని రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా బుధవారం సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల మేర ఇలాంటి కరెన్సీ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యక్తిపై సత్తుపల్లిలో దొంగనోట్ల ముఠాలోని కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పాత కరెన్సీ నిల్వ చేసిన ఇంటిని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వేంసూరు ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. -
కోట్లాది రూపాయల నోట్లకట్టలు..
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో కనీవినీ ఎరుగనిరీతిలో రద్దైన కరెన్సీనీ పట్టుబడింది. కాన్పూర్‌లోని స్వరూప్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో కోట్లాది రూపాయల నోట్లకట్టలు దొరికాయి. రద్దుచేసిన రూ. 500, వెయ్యి నోట్ల కట్టలు భారీ ఎత్తున పరుపులా పేర్చి ఉండటాన్ని చూసి అధికారులే నివ్వెరపోయారు. భారీ మొత్తంలో దొరికిన పాత నోట్లకట్టల్లో ఇప్పటికే రూ. 97 కోట్లమేర లెక్కించారు. ఇంకా లెక్కించాల్సిన నోట్లకట్టలు ఉండటంతో వందకోట్లకుపైగానే రద్దైన కరెన్సీ ఇక్కడ దాచినట్టు భావిస్తున్నారు. జాతీయ దర్యాప్తు బృందాలు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. సీజ్ చేసిన పాత కరెన్సీ విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో పాత కరెన్సీని జాతీయ సంస్థలు పట్టుకున్నాయి. కానీ, ఇంతమొత్తంలో రద్దైన కరెన్సీ ఎప్పుడూ దొరకలేదు. కాబట్టి పెద్దనోట్ల రద్దు తర్వాత అతిపెద్దమొత్తంలో పట్టుబడిన పాత కరెన్సీ ఇదేనని భావిస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది దాటినా ఇప్పటికీ పెద్ద మొత్తంలో పాత కరెన్సీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో ఓ వ్యక్తి నివాసంలో రద్దు అయిన పాతనోట్లు భారీగా ఉన్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ తాజా ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. -
ఆరు నెలలుగా రూ. 45కోట్లు అక్కడే.!
టీనగర్(చెన్నై): పాతనోట్ల రద్దు సమయంలో నగరంలోని ఓ వ్యాపారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.45 కోట్ల డబ్బు పోలీసు స్టేషన్లో మగ్గుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నాయి. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో గల వ్యాపారి దండపాణి ఇంట్లో గత మే నెలలో చెన్నై నగర పోలీసులు హఠాత్తుగా తనిఖీలు జరిపారు. అతని ఇంట్లో దాచిన రూ.45 కోట్ల పాత 500, 1000 రూపాయిల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చెన్నై పోలీసులు కేంద్ర ఆదాయపన్ను శాఖకు, రిజర్వు బ్యాంకులకు సమాచారం తెలిపారు. అయితే, వారు స్పందించలేదు. దీంతో ఆ నగదును పోలీసులు కోర్టులో అప్పగించారు. కోర్టు ఆ నగదును ఠాణాలోనే ఉంచాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో రూ.45 కోట్ల నగదును ట్రంకు పెట్టెలో ఉంచి కోడంబాక్కం పోలీసు స్టేషన్లో ఉంచారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సంస్థలకు పోలీసులు లేఖ పంపారు. అయినా వారు స్పందించలేదు. దీంతో ఆ డబ్బు అప్పటి నుంచి స్టేషన్లోనే ఉండిపోయింది. నగదు రద్దు చేయడంతోనే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. దీంతో చెల్లని నోట్లలో 10 నోట్లకు పైన కలిగివుంటే శిక్షార్హమని, దీంతో రూ.10 వేల అపరాధం లేదా ఆ నగదుకు ఐదు రెట్ల అపరాధం విధించే వీలుంది. దీంతో రూ.45 కోట్లు ఉంచుకున్నందుకు చర్యలు తీసుకునే వీలుంది. అయినప్పటికీ పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఎటువంటి అధికారం లేదు. దీన్ని ఐటీ శాఖ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మాత్రమే చేసే వీలుంది. అయితే వారు ఇన్నాళ్లయినా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు. అలాగే, నోట్ల రద్దు సమయంలో షెనాయ్‌నగర్, అన్నానగర్, కోయంబేడు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కూడా కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోలేదు. కోర్టుకు కేసు: ఈ వ్యవహారంపై ఐటీ శాఖ న్యాయవాది షీల మాట్లాడుతూ.. చెల్లని నోట్లపై చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకంగా కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం ఇవి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఎదుట విచారణలో ఉన్నాయని అన్నారు. దీంతో తదుపరి చర్యలు తీసుకోలేక పోతున్నామని అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. -
రద్దయిన కరెన్సీ నోట్లు మార్చే ముఠా అరెస్టు
విజయవాడ : రద్దయిన పాత కరెన్సీ నోట్లు మార్చే ముఠాను శనివారం టాస్క్‌ఫోర్స్, సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.23 లక్షల పాత రూ.500 నోట్లు 10 సెల్ఫోన్లు, రెండు మోటారు బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కె.శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్ సూర్యారావుపేట పోలీసు స్టేష¯న్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్వరాజ్య మైదానం వద్ద ఎమిమిది మంది వ్యక్తులు పాత నోట్లు మార్చేందుకు బేరసారాలు చేస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీపీలు పేర్కొన్నారు. రూ.లక్ష పాత నోట్లకు రూ.45 వేలు ఇచ్చే ఒప్పందంపై ఈ ముఠా తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని వివరించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు నోట్లు మార్పిడి చేస్తున్న 8 మందిని పట్టుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నోట్లు చెలామణి గాక పోయినా నిందితులు సంస్థల పేరుతో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా మార్పిడి చేస్తామని ఈ విధంగా డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన తోట సాయి వెంకట్, టి.కమల్‌కుమార్, చిరువెళ్ల గోపాలకృష్ణ, హరీష్, కుమార్, వెంకటేశ్వరరావు, జీవన్, విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విలేకరుల సమావేశంలో సూర్యారావుపేట సీఐ వినయ్‌మోహన్, టాస్క్‌ఫోర్స్ సీఐ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ. 50 లక్షల పాతనోట్లు..
నెల్లూరు పోలీసుల అదుపులో ముగ్గురు నెల్లూరు(క్రైమ్): పాతనోట్లను మార్చేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ కింగ్స్‌కోర్ట్ అపార్ట్మెంట్లో వ్యాపారి వేమూరు నరహరిరెడ్డి నివాసముంటున్నాడు. అతని వద్ద రూ. 50 లక్షలు పాత వెయ్యిరూపాయల నోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతనికి మన్సూర్‌నగర్‌కు చెందిన కొత్తూరు శ్రీనివాస్, నరసింహకొండకు చెందిన కుర్రా శ్రీకాంత్‌రెడ్డితో పరిచయమైంది. తమకు సగం డబ్బులిస్తే వాటిని మారుస్తామని వారు చెప్పగా నరహరి అంగీకరించాడు. ఈ క్రమంలో నరహరెడ్డి ఇంట్లో పాతనోట్లు మార్చుకుంటున్నారని నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీతారామయ్యకు సమాచారమందింది. ఆయన ఈ విషయాన్ని నగర డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు నరహరిరెడ్డి ప్లాటుపై దాడిచేసి రూ. 50 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. -
పాత నోట్ల డిజైన్లతో కొత్త పర్సులు
మాచర్ల : రద్దు చేసిన పాత నోట్ల నమూనాలో పర్సులు తయారు చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్, రైల్వేష్టేషన్ రోడ్, బస్టాండ్ సెంటర్, రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో కేవలం రూ. 20 కే డిజైన్ పర్సులు అమ్ముతున్నారు. -
స్కానింగ్ యంత్రాలకు కూడా చిక్కకుండా..
న్యూఢిల్లీ: ఒకవైపు పోలీసుల స్టింగ్ ఆపరేషన్ దళారులు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మరోవైపు స్కానింగ్ యంత్రాలను కూడా బురిడీ కొట్టిస్తున్న హవాలా దారులు పెద్దనోట్ల మార్పిడిలో చెలరేగిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వలపన్ని చాకచక్యంగా దళారుల ఆటకట్టిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో భారీఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న హవాలాదారులకు చెక్ పెట్టేందుకు సీబీఐ, ఈడీ, క్రైం బ్రాంచ్ అధికారులు వినియోగదారులా నటిస్తూ స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇలా కోట్ల కొద్దీ కొత్త, పాత నోట్లను సీజ్ చేస్తున్నారు. బుధవారం డిల్లీలో ఒక హోటెల్ లో దాదాపు మూడున్నరకోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హోటెల్ లో ఆదాయ పన్ను శాఖ, క్రైం బ్రాంచ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో సుమారు3.25కోట్ల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనగదును ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్ దిగా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయంలోని స్కానింగ్ యంత్రాలకు కూడా దొరక్కుండా నిపుణులతో ఒక పద్ధతిలో నోట్లను ప్యాక్ చేయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని టేపులు, తీగల సహాయంతో వీటిని పాక్ చేయించి ఎక్స్ రే మిషీన్లు కూడా కనిపెట్టకుండా తప్పించు కుంటున్నారని భావిస్తున్నారు. ఈ కేసులో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల మొబైల్ డాటాను పరిశీలిస్తున్నామని విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని ధానే లో మంగళవారం రాత్రి 1.04కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దు అయిన పెద్ద నోట్లను 20 శాతం కమిషన్ తో మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో దాడిచేసిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి సుమారు కోటికి పైగా విలువ చేసే కొత్త రూ.2వేల నోట్లను పట్టుకున్నారు. చండీ ఘడ్ లో రూ.2.19 కోట్లను ఈడీ సీజ్ చేసింది. బెంగళూరులో బుధవారం రూ.2.25కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చండీఘడ్ లో రెండుకోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం కొట్టనోట్లే ఉన్నట్టు అధికారులు తెలిపారు. గోవాలో 67లక్షలకొత్త కరెన్సీ నోట్లను ఈడీ పట్టుకుంది. బ్యాంకాక్ నుంచి వస్తున్న దంపతులు బేబీ డైపర్ దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 16 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో స్టింగ్ ఆపరేషన్ ద్వారా అక్రమ నగదు మార్పిడికి పాల్పడుతున్న రాకెట్టును ఛేదించిన ఈడీ అధికారులు సుమారు రూ.93 లక్షల కోత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు మధ్యవర్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఆ రూ.11,400 కోట్లు ఏమవుతాయి?
దేశంలోని పేదలకు ప్రాణసంకటంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం డబ్బున్న పెద్దలకే మేలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) లెక్కల ప్రకారం దేశంలో ఆధార్ కార్డులేని ఇంటి యజమానులు 5.8 కోట్ల మంది. బ్యాంక్ ఖాతాలు సహా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లనే వారికి ఇంతవరకు ఆధార్ కార్డులు అందజేయలేకపోయామని అధికారులే చెబుతున్నారు. ఈ కార్డులేని వారంతా నగదుతోనే కాపురాలు నెట్టుకొస్తుంటారు. అత్యవసరాల కోసం ఉన్నంతలో కొంత నగదును దాచుకుంటారు. ఇలాంటి వారంతా రెండువేల రూపాయలు విలువైన పాత 500 రూపాయల నోట్లను దాచుకున్నారనుకుంటే వారు దాన్ని ఎలా మార్చుకుంటారు? వారంతా 20, 30 శాతం కమీషన్‌కు మార్చుకుంటారా? నిజాయితీగా రిజర్వు బ్యాంకులో మార్చుకుందామంటే వారివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు కదా? ఉత్తరాఖండ్, జార్ఖండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి ప్రజలు వంద రూపాయలకు 500 రూపాయల నోట్లను అమ్ముకుంటున్నారంటూ మీడియాలోనే ఎన్నో కథనాలు వస్తున్నాయి. అలా అమ్మినా నాలుగు నోట్లకు 1600 రూపాయలు నష్టపోతారు కదా? తక్కువ సొమ్ముకు అమ్ముకోలేకపోతే వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయలు వృధా అవుతాయి. ఇలా 5.8 కోట్ల మంది వద్ద ఉన్న రూపాయలు వృధా అవుతాయనుకుంటే వాటి మొత్తం విలువ 11,400 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ విధంగా 'బ్లాక్' అయ్యే ఈ సొమ్మును ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ ఏ లెక్కల్లో చూపిస్తుంది? ఇప్పటికే ప్రజల సేవింగ్స్ మీద, ఫిక్సిడ్ డిపాజిట్లపై, రుణాలపై వడ్డీలు తగ్గించిన బ్యాంకులు, మున్ముందు మరింత తగ్గుతాయని చెబుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఎవరికి లాభం. దేశంలోని పది పెద్ద కార్పొరేట్ సంస్థలు కలిసి 7.3 లక్షల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాయని ఆర్బీఐ లెక్కలే చెబుతున్నాయి. తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థలకు ఒక్క ఏడాదికి 7,300 కోట్ల రూపాయలు కలిసొస్తుంది. దేశంలో నల్లడబ్బును అరికడితే పేదలకు లాభం జరుగుతుందని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిరోజూ చెబుతోంది. ఎలాంటి లాభాలు జరుగుతాయో ఇంతవరకు ఒక్కటంటే ఒక్కదాని గురించి వివరించలేదు. పేదలకు ఒనగూడే లాభాల గురించి ప్రభుత్వం వద్ద అసలు రోడ్ మ్యాప్ ఉందా? అసలు ఏం ఒరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా? ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా మోదీ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తుందా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అప్పటి వరకు త్యాగం చేసే దేశభక్తి మా పేదలకు ఉంది. రోడ్లపై టిఫిన్లు, కూరగాయలు, చిల్లర సరకులు అమ్ముకునేవాళ్లు వ్యాపారం లేక, పని దొరక్క పస్తులుంటున్న కూలీలు రోడ్లపైనా, వలసవచ్చినా బతుకుతెరువు కనిపించని కార్మికులు దిక్కులేని చోట, కంపెనీ లేఆఫ్‌లతో ఆకలి తాళలేక కార్మికులు గేట్ల వద్ద, క్యూలో సత్తువుడిగిన వయస్సులో నిలబడలేక పేదలు, పెద్దలు మరణిస్తూనే ఉంటారు. వారి త్యాగాలకు ప్రతిఫలం ఏనాటికైనా ఉంటుందా? -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
నోట్ల మార్పిడి ఆపేస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేసిన తర్వాత బ్యాంకులలో వాటిని మార్చుకోడానికి విపరీతమైన క్యూలు ఉంటున్నాయి. చాలాచోట్ల వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బ్యాంకులలో అసలు జరగాల్సిన పని మొత్తం ఆగిపోతోందని, అందుకోసం నోట్ల మార్పిడిని తాత్కాలికంగా ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందంటూ ఒక్కసారిగా జాతీయ మీడియా ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. నిజంగా ఇప్పటికిప్పుడే నోట్ల మార్పిడిని ఆపేస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అయితే.. కాసేపటి తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియను ఆపే ఆలోచన ఏమీ లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడి విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న 4,500 రూపాయల పరిమితిని 2000 రూపాయలకు తగ్గించడంతో ఎక్కువ మందికి డబ్బులు అందుబాటులోకి వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
పెట్రోల్ బంక్‌లో ఘర్షణ, గాయాలు
ముజఫర్‌నగర్: పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. పెట్రోల్ బంక్‌లు, ఇతర అత్యవసర సేవల కోసం పాత నోట్లు వాడుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో పలుచోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో ఇదే అంశంలో తలెత్తిన వివాదం తన్నుకునేదాకా వెళ్లింది. ఢిల్లీ, సహరాన్పూర్ జాతీయ రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం వాహనదారులు పాత 500, 1000 నోట్లు ఇవ్వడంతో.. అవి చెల్లవంటూ బంకు సిబ్బంది వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
పాత పెద్ద నోట్ల కష్టాలకు మరో ఉపశమనం
-
నోట్ల కష్టాలకు మరో ఉపశమనం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించింది. పాత పెద్ద నోట్లు ఈ నెల 24 వరకు చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌ల్లో నవంబర్ 24 అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. సోమవారం అర్ధరాత్రి వరకే అనుమతిచ్చినా బ్యాంకులు, ఏటీఎం వద్ద పెరుగుతున్న రద్దీ, ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో ఈనెల 24 అర్ధరాత్రి దాకా అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ లోపు కొత్త కరెన్సీ చాలా వరకు అందుబాటులోకి రావొచ్చని భావిస్తోంది. నగదు మార్పిడి, విత్ డ్రా పరిమితిని కూడా స్వలంగా పెంచింది. -
రికార్డుస్థాయిలో పన్నులు
కరెంట్ బిల్లుల ద్వారా వచ్చింది రూ.72లక్షలు ఇంటి పన్నుల ద్వారా రూ.26.81 లక్షలు కరెంటు బిల్లుల చెల్లింపునకు మరో మూడు రోజులు అవకాశం సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని/ కోల్‌సిటీ : పెద్దనోట్లు రద్దు ఇంకా పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తమవద్ద రూ.500, 1000పాతనోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎంతగా ఆందోళన చెందుతున్నారో పన్నుల చెల్లింపే అద్దంపడుతోంది. పాతనోట్లుపన్నుల కట్టలు శుక్రవారం నుంచి చెల్లుబాటు కావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొత్త నోట్లు అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పాతనోట్లతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు శుక్రవారం ఒక్క రోజు చెల్లించవచ్చని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో చెల్లింపులు వచ్చాయి. రూ.కోటి మేర ఒక్క రోజులోనే వసూలయ్యాయి. కరెంట్ బిల్లులు పెద్దపల్లి ఈఆర్వో పరిధిలో రూ.30 లక్షలు, గోదావరిఖని పరిధిలో రూ.32లక్షలు, మంథని పరిధిలో రూ.10లక్షలు ట్రాన్స్‌కో ఖజానాకు వచ్చి చేరాయి. దీంతో ట్రాన్స్‌కో మొండి బకాయిలను రాబట్టేందుకు ఇదే మంచి అవకాశమని, పాతనోట్లతో బిల్లుల చెల్లింపును మరో మూడురోజులకు పెంచింది. ఇక ఇంటి పన్నుల విషయానికి వస్తే పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలో రూ.10లక్షలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.11.50లక్షలు, జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల ద్వారా రూ.5.31లక్షలుఖజానాకు వచ్చి చేరాయి. ట్రాన్స్‌కోకు భారీగా బకాయిల చెల్లింపు గోదావరిఖని విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని జనగామ, రాంనగర్, ౖయెటింక్లయిన్‌కాలనీ, గౌతమినగర్, పీజీ సెంటర్, రామగుండం, ఆకెనపల్లి, బసంత్‌నగర్ సబ్‌స్టేçÙన్లలో కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం ఒక్కరోజే బకాయిలు రూ.26లక్షలు వసూలయ్యాయి. గురువారం ఈ నోట్లు అనుమతించకపోవడంతో కేవలం రూ.1.50లక్షలు వసూలయ్యాయి. శుక్రవారం ఏకంగా రూ.26 లక్షలు వసూలయ్యాయి. కార్పొరేషన్‌కు రూ.11 లక్షలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూలుకు శుక్రవారం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వడంతో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు నగరంలో ప్రచారం చేపట్టారు. మూడు ఆటోరిక్షాలకు మైక్‌ల ద్వారా నగరంలో ప్రచారాన్ని నిర్వహించారు. 17 మంది బిల్ కలెక్టర్లతోపాటు మున్సిపల్ కార్యాలయంలో రెండు ప్రత్యేక కౌంటర్లను శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు బిల్లులు చెల్లించేలా అందుబాటులో ఉంచారు. రాత్రి 7.30గంటల వరకు రూ.11.50 లక్షల వరకు రికార్డుస్థాయిలో పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలోని 50డివిజన్లలో పన్నుల వసూళ్ల కోసం వెళ్లిన బిల్కలెక్టర్లు తిరిగి కార్యాలయానికి వస్తే పూర్తి కలెక్షన్ వివరాలు తెలిసే వీలుంటుందని ఆర్ఐ శంకర్రావు తెలిపారు. -
మరో మూడురోజులు పాతనోట్లకు ఓకే
-
మరో మూడురోజులు పాతనోట్లకు ఓకే
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌ల్లో సోమవారం అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. శుక్రవారం అర్ధరాత్రి వరకే అనుమతిచ్చినా బ్యాంకులు, ఏటీఎం వద్ద పెరుగుతున్న రద్దీ, ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో ఈనెల 14 అర్ధరాత్రి దాకా అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ లోపు కొత్త కరెన్సీ అందుబాటులోకి రావొచ్చని భావిస్తోంది. టోల్ రద్దు పొడిగింపు జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా టోల్ గేట్ల వద్ద పన్ను వసూళ్ల నిలుపుదలను కూడా కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజులు పొడగించింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ కట్టాల్సిన పని లేదంటూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఔటర్ రింగురోడ్డుపై కూడా ఈ నెల 14 వరకు టోల్ కట్టాల్సిన అవసరం లేదంటూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటన విడుదల చేశారు. -
నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరుల మాట పక్కన పెడితే.. సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మొదటి రోజు నోట్ల మార్పిడికి బ్యాంకులకు క్యూ కట్టిన ప్రజలు.. శుక్రవారం నుంచి ఏటీఎమ్ ల వద్ద కొత్త నోట్లు అందుబాటులోకి రావడంతో రద్దీ పెరిగింది. తెలంగాణ సచివాలయంలో ఉన్న రెండు బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఏటీఎమ్ లలో నగదు తీసుకునేందకు సచివాలయ ఉద్యోగులు క్యూ కట్టారు. నగదు డ్రా విషయంలో రూ.100 నోట్లు తీసుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. కేంద్రం ఎవరిని దృష్టిలో పెట్టుకుని పెద్ద నోట్లను రద్దు చేసిందో అర్థంకావడం లేదన్నారు. నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం.. తామేందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. రోజు వారీ కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు రూ.4 వేలకు మించి ఇవ్వమంటున్నారని.. నిన్న డ్రా చేసిన వారికి ఈ రోజు అవకాశం లేదనడం దారుణమన్నారు. తక్షణమే రోజువారీ నగదు డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచాలి ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
సెక్స్ వర్కర్లకూ నోట్ల కష్టాలు!
అందరి కష్టాలూ ఒక ఎత్తయితే.. వాళ్ల కష్టాలు మరో ఎత్తు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సెక్స్ వర్కర్లు సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి వద్దకు వచ్చేవాళ్లు పాత 500, 1000 రూపాయల నోట్లను మాత్రమే ఇస్తున్నారు. వద్దంటే అవి తప్ప వేరే డబ్బులు లేవంటున్నారు. కోల్‌కతాలోని అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన సోనాగచిలో ఈ పరిస్థితి ఎదురవుతోందని అక్కడి సెక్స్ వర్కర్లు వాపోతున్నారు. ఆ డబ్బు తీసుకుని తాము ఏం చేసుకోవాలని.. ఒకవేళ వద్దంటే మొదటికే మోసం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ డబ్బంతా వాళ్లు పూర్తిగా కష్టపడి సంపాదించేదే తప్ప.. ఒక్క రూపాయి కూడా బ్లాక్ మనీ అన్నది ఉండదు. కానీ, అది తాము సంపాదించినదని నిరూపించుకోడానికి వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. దానికితోడు, వాటిని మార్చుకుందామన్నా, చట్టపరమైన పత్రాలు ఏమీ లేకపోవడంతో బాగా ఇబ్బంది అవుతోంది. కోల్‌కతాలో మిగిలిన నగరం మొత్తం పాత కరెన్సీ నోట్లను మార్చుకోవడంలో బిజీబిజీగా గడిపితే.. సోనాగచిలో మాత్రం పాత నోట్లు తీసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. పాతనోట్లు తీసుకోబోమని చెబితే తమకు కొన్ని రోజుల పాటు అసలు వ్యాపారమే ఉండదని, అయితే తరచుగా వచ్చేవాళ్లను మాత్రం తర్వాత కొత్తనోట్లు తెచ్చి ఇవ్వాలని చెబుతున్నామని అన్నారు. ఇక పెద్దమొత్తాల్లో చెల్లించే కస్టమర్ల విషయంలో అయితే పుస్తకాల్లో రాసుకుంటున్నారట. వాళ్లు తమకు బాగానే గుర్తని, అందువల్ల తర్వాత వచ్చినప్పుడు వాళ్ల దగ్గర కొత్త నోట్లు తీసుకుంటామని చెబుతున్నారు. -
కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు...
2005 ముందునాటి నోట్లపై జూన్ 30 తాజా డెడ్‌లైన్ ముంబై: 2005కు పూర్వం ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఉద్దేశించిన గడువును రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) వచ్చే ఏడాది జూన్ 30 దాకా పొడిగించింది. వాస్తవానికి ఇది జనవరి 1తో ముగిసిపోవాల్సి ఉంది. రూ.500, రూ.1,000 సహా వివిధ మారకం విలువల కరెన్సీ నోట్లను జూన్ 30 దాకా పూర్తి విలువకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను చలామణీలో నుంచి ఉపసంహరించే దిశగా వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడంగానీ అందుబాటులో ఉన్న బ్యాంకుల శాఖల్లో గానీ ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించిన సంగతి తెలిసిందే. ఈ రకంగా సింహ భాగం పాత నోట్లను ఇప్పటికే చలామణీలో నుంచి ఉపసంహరించినట్లు ఆర్బీఐ తెలిపింది. అదనపు భద్రతా ఫీచర్లతో ముద్రిస్తున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు దాదాపు దశాబ్దం నుంచి చలామణీలో ఉండటం వల్ల పాత నోట్ల ఉపసంహరణతో ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడం కొనసాగిస్తామని ఆర్బీఐ పేర్కొంది. 2005కి పూర్వం నోట్లకు వెనుకవైపున వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. నకిలీ కరెన్సీకి చెక్ చెప్పే ఉద్దేశంతో ఆ తర్వాత నుంచి అదనపు భద్రతా ప్రమాణాలు జోడించడంతోపాటు ముద్రణ సంవత్సరాన్నీ నోట్లపై ముద్రిస్తున్నారు. పాత నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు పెట్టాక రూ. 52,855 కోట్ల విలువ చేసే 144.66 కోట్ల నోట్లను ఆర్బీఐ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇందులో రూ.100 మారకం విలువగల నోట్లు 73.2 కోట్లు, రూ.500 నోట్లు 51.85 కోట్లు, రూ. 1,000 నోట్లు 19.61 కోట్లు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ్యాల్లో ధ్వంసం చేయడం జరిగింది. 2005కి పూర్వం ముద్రించిన సిరీస్ నోట్లను శాఖల్లో గానీ ఏటీఎంల ద్వారా గానీ, జారీ చేయొద్దంటూ ఇప్పటికే బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఈ చర్యలతో ప్రస్తు తం చెలామణీలో ఉన్న పాత నోట్ల సంఖ్య స్వల్పం గానే ఉంటుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. -
జనవరి 1 వరకు ‘ఆ నోట్లు’ మార్చుకోవచ్చు
ముంబై: 2005 నాటికన్నా ముందు ముద్రించిన రూ.500, రూ. 1000 సహా అన్ని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు 2015, జనవరి 1 వరకు గడువును పెంచుతూ రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. నోట్లను మార్చుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించరాదని, పాతనోట్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా నోట్లను మార్చుకునే వ్యక్తి సదరు బ్యాంకు ఖాతాదారుడే కానవసరం లేదని, ఒకే సమయంలో ఎన్ని నోట్లనైనా మార్చుకునేందుకు అనుమతించాలని, ఈ క్రమంలో ఎలాంటి రుసుములూ విధించరాదని బ్యాంకులకు నిర్దేశించింది. అదేసమయంలో చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లోని వారు నోట్లు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక నోట్ల ఎక్సేంజ్ మేళాను ఏర్పాటు చేయాలని సూచించింది. అదేసమయంలో ప్రజలు ఆయా నోట్లను తమ వ్యాపార, ఇతర లావాదేవీలకు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, జనవరి 22 నాటి తమ విజ్ఞప్తికి స్పందించిన ప్రజలు ఇప్పటికే వారి వద్ద ఉన్న పాత నోట్లను అత్యధిక భాగం మార్చుకున్నారని, కొద్ది మొత్తంలో మాత్రమే 2005కు పూర్వం నాటి నోట్లు(రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.1000) ప్రజల వద్ద ఉన్నాయని బ్యాంకు తెలిపింది.