
టీనగర్(చెన్నై): పాతనోట్ల రద్దు సమయంలో నగరంలోని ఓ వ్యాపారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.45 కోట్ల డబ్బు పోలీసు స్టేషన్‌లో మగ్గుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నాయి. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో గల వ్యాపారి దండపాణి ఇంట్లో గత మే నెలలో చెన్నై నగర పోలీసులు హఠాత్తుగా తనిఖీలు జరిపారు. అతని ఇంట్లో దాచిన రూ.45 కోట్ల పాత 500, 1000 రూపాయిల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి చెన్నై పోలీసులు కేంద్ర ఆదాయపన్ను శాఖకు, రిజర్వు బ్యాంకులకు సమాచారం తెలిపారు. అయితే, వారు స్పందించలేదు. దీంతో ఆ నగదును పోలీసులు కోర్టులో అప్పగించారు. కోర్టు ఆ నగదును ఠాణాలోనే ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.
దీంతో రూ.45 కోట్ల నగదును ట్రంకు పెట్టెలో ఉంచి కోడంబాక్కం పోలీసు స్టేషన్‌లో ఉంచారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సంస్థలకు పోలీసులు లేఖ పంపారు. అయినా వారు స్పందించలేదు. దీంతో ఆ డబ్బు అప్పటి నుంచి స్టేషన్‌లోనే ఉండిపోయింది. నగదు రద్దు చేయడంతోనే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. దీంతో చెల్లని నోట్లలో 10 నోట్లకు పైన కలిగివుంటే శిక్షార్హమని, దీంతో రూ.10 వేల అపరాధం లేదా ఆ నగదుకు ఐదు రెట్ల అపరాధం విధించే వీలుంది. దీంతో రూ.45 కోట్లు ఉంచుకున్నందుకు చర్యలు తీసుకునే వీలుంది.
అయినప్పటికీ పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఎటువంటి అధికారం లేదు. దీన్ని ఐటీ శాఖ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మాత్రమే చేసే వీలుంది. అయితే వారు ఇన్నాళ్లయినా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు. అలాగే, నోట్ల రద్దు సమయంలో షెనాయ్‌నగర్, అన్నానగర్, కోయంబేడు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కూడా కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోలేదు.
కోర్టుకు కేసు: ఈ వ్యవహారంపై ఐటీ శాఖ న్యాయవాది షీల మాట్లాడుతూ.. చెల్లని నోట్లపై చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకంగా కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం ఇవి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఎదుట విచారణలో ఉన్నాయని అన్నారు. దీంతో తదుపరి చర్యలు తీసుకోలేక పోతున్నామని అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment