ఆ రూ.11,400 కోట్లు ఏమవుతాయి?
ఆ రూ.11,400 కోట్లు ఏమవుతాయి?
Published Fri, Nov 25 2016 6:04 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
దేశంలోని పేదలకు ప్రాణసంకటంగా మారిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం డబ్బున్న పెద్దలకే మేలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) లెక్కల ప్రకారం దేశంలో ఆధార్ కార్డులేని ఇంటి యజమానులు 5.8 కోట్ల మంది. బ్యాంక్ ఖాతాలు సహా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లనే వారికి ఇంతవరకు ఆధార్ కార్డులు అందజేయలేకపోయామని అధికారులే చెబుతున్నారు.
ఈ కార్డులేని వారంతా నగదుతోనే కాపురాలు నెట్టుకొస్తుంటారు. అత్యవసరాల కోసం ఉన్నంతలో కొంత నగదును దాచుకుంటారు. ఇలాంటి వారంతా రెండువేల రూపాయలు విలువైన పాత 500 రూపాయల నోట్లను దాచుకున్నారనుకుంటే వారు దాన్ని ఎలా మార్చుకుంటారు? వారంతా 20, 30 శాతం కమీషన్‌కు మార్చుకుంటారా? నిజాయితీగా రిజర్వు బ్యాంకులో మార్చుకుందామంటే వారివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు కదా? ఉత్తరాఖండ్, జార్ఖండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి ప్రజలు వంద రూపాయలకు 500 రూపాయల నోట్లను అమ్ముకుంటున్నారంటూ మీడియాలోనే ఎన్నో కథనాలు వస్తున్నాయి. అలా అమ్మినా నాలుగు నోట్లకు 1600 రూపాయలు నష్టపోతారు కదా?
తక్కువ సొమ్ముకు అమ్ముకోలేకపోతే వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయలు వృధా అవుతాయి. ఇలా 5.8 కోట్ల మంది వద్ద ఉన్న రూపాయలు వృధా అవుతాయనుకుంటే వాటి మొత్తం విలువ 11,400 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ విధంగా 'బ్లాక్' అయ్యే ఈ సొమ్మును ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ ఏ లెక్కల్లో చూపిస్తుంది? ఇప్పటికే ప్రజల సేవింగ్స్ మీద, ఫిక్సిడ్ డిపాజిట్లపై, రుణాలపై వడ్డీలు తగ్గించిన బ్యాంకులు, మున్ముందు మరింత తగ్గుతాయని చెబుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఎవరికి లాభం. దేశంలోని పది పెద్ద కార్పొరేట్ సంస్థలు కలిసి 7.3 లక్షల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాయని ఆర్బీఐ లెక్కలే చెబుతున్నాయి. తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం ఈ కార్పొరేట్ సంస్థలకు ఒక్క ఏడాదికి 7,300 కోట్ల రూపాయలు కలిసొస్తుంది.
దేశంలో నల్లడబ్బును అరికడితే పేదలకు లాభం జరుగుతుందని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిరోజూ చెబుతోంది. ఎలాంటి లాభాలు జరుగుతాయో ఇంతవరకు ఒక్కటంటే ఒక్కదాని గురించి వివరించలేదు. పేదలకు ఒనగూడే లాభాల గురించి ప్రభుత్వం వద్ద అసలు రోడ్ మ్యాప్ ఉందా? అసలు ఏం ఒరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా? ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా మోదీ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తుందా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అప్పటి వరకు త్యాగం చేసే దేశభక్తి మా పేదలకు ఉంది. రోడ్లపై టిఫిన్లు, కూరగాయలు, చిల్లర సరకులు అమ్ముకునేవాళ్లు వ్యాపారం లేక, పని దొరక్క పస్తులుంటున్న కూలీలు రోడ్లపైనా, వలసవచ్చినా బతుకుతెరువు కనిపించని కార్మికులు దిక్కులేని చోట, కంపెనీ లేఆఫ్‌లతో ఆకలి తాళలేక కార్మికులు గేట్ల వద్ద, క్యూలో సత్తువుడిగిన వయస్సులో నిలబడలేక పేదలు, పెద్దలు మరణిస్తూనే ఉంటారు. వారి త్యాగాలకు ప్రతిఫలం ఏనాటికైనా ఉంటుందా?
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్
Advertisement
Advertisement