పది రోజులాగితే ఖాతాలోకి రూ.15 లక్షలు వస్తాయా?
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకొని నేటికి దాదాపు 40 రోజులవుతోంది. తన నిర్ణయం వల్ల తలెత్తిన ఇబ్బందులను ఒక్క యాభై రోజులు భరించమని దేశ ప్రజలు మోదీ చేసిన విజ్ఞప్తిలో కూడా మిగిలింది ఇంకా పది రోజులే. నేటికి బ్యాంకుల ముందు ప్రజల క్యూలూ తగ్గలేదు. ఏటీఎంలు పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద అసహనం భరించలేక ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని చితకబాదుతున్న సంఘటనలు కూడా వింటున్నాం. పింఛను డబ్బుల కోసం ముగ్గుబుట్ట ముసలవ్వలు బ్యాంకుల వద్దే తెల్లార్లు పడిగాపులు పడుతున్నా దృశ్యాలను చూస్తున్నాం.
ఇన్ని బాధలు, కష్టాలు భరిస్తూ కూడా నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పేదలు, బడుగువర్గాలు, సగటు జీవులు ఎందుకు విమర్శంచడం లేదు? రాబిడ్ హుడ్‌లాగా మోదీ పెద్దోళ్లను దోచి పేదోళ్లకు పెడతారని ఆశిస్తున్నారా? ఆయన హామీ ఇచ్చినట్లుగా జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంక్‌ల ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు వచ్చి పడతాయని భ్రమ పడుతున్నారా? మోదీ చెప్పినట్లుగా ఇంకా పది రోజులే కాదు, మరో పాతిక రోజులు కష్టనష్టాలను భరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నా బడుగు జీవులు కూడా దేశంలో ఎంతమందో ఉన్నారు. ఎందుకు? మొదట దేశభక్తి, జాతీయవాద ప్రభావమని భావించారు. అదంతా రాజకీయ వాదమే.
వివిధ మీడియాల ముందు పేదలు, బడుగు జీవులు, సగటు భారతీయులు, మధ్యతరగతి ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిశీలిస్తే ఇది ఒకరకమైన మానసిక పరిస్థితిని సూచిస్తోంది. ధనవంతుల మీద పేదవాళ్లకున్న ఆక్రోశంగా కనిపిస్తోంది. తామింత కాలం పడిన ఇబ్బందులకు కనీసం ఒక్కసారైనా ధనవంతుడు ఇబ్బంది పడాలన్న ఆక్రందన అనిపిస్తోంది. తమ కష్టాలకు ఫలితం తమకు దక్కకపోయినా మిద్దెల్లో నివసించే పెద్దలకు కొంతైన బుద్ధి చెప్పాలనే గద్దింపు గోచరిస్తోంది.
ఎప్పుడూ హిందూ, ముస్లింలు అనే అంశంపై చర్చ జరిగే ఈ దేశంలో మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల మొట్టమొదటిసారిగా ప్రజల మధ్య పేద, ధనిక అనే చర్చ జరుగుతోంది. ధనిక, పేద మధ్య వ్యత్యాసం బాగా పెరిగి పోవడమే ఈ చర్చకు దారి తీసిందేమో? ఓ సగటు జీవి వెయ్యి సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఆదాయానికి సమానమైన మొత్తాన్ని ఓ ధనవంతుడు నేడు ఓ కారు కొనడానికి ఖర్చు పెడుతున్నారు. అంటే ధనవంతుల పట్ల వారికి ఎంత ఆక్రోశం పెరుగుతుండాలి.
‘మేము 15, 20 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు కుటుంబం ఆ రోజు అవసరాలకే సరిపోతుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు. ఇకముందు వస్తుందన్న ఆశలేదు. మోదీ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలివ్వాలి. ముఖ్యంగా నల్ల డబ్బున్న వారిని జైలుకు పంపాలన్న కసి మాలో ఎంతో ఉంది. రేపు ఇందులో మోదీ విఫలమైనా మాకొచ్చే నష్టమేమి లేదు. మా జీవితాలు ఇలాగే కొనసాగుతాయి’ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఢిల్లీలోని కొంత మంది ఆటో డ్రైవర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ‘నేను 15 ఏళ్లుగా ఓ పెద్ద మనిషి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఇన్నేళ్లకు నా జీతం 15 వేల రూపాయలకు చేరుకుంది. డబ్బులు పెంచుమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. అడిగిన రోజున ఇంటికెళ్లిపో, మరోకడు వస్తాడని బెదిరిస్తారు. అది కూడా నిజమే. కార్లలో వాళ్ల కులుకులను, షికార్లను చూస్తుంటే కడుపు మండిపోతోంది. మోదీ నిర్ణయం వల్ల వాళ్లకు ఏదైనా కావాలి’ ఇది మరో మీడియా ముందు కారు డ్రైవర్ ఆవేదన.
పేదల్లో ఉండే ఇలాంటి సైక్‌ను ‘ష్రేడన్ ఫియూడ్’ అనే జర్మనీ పదంతో పోల్చవచ్చు. మరో వ్యక్తి సొమ్ము కోల్పోతే ఒక వ్యక్తి ఆనందించం ఈ పదానికి అర్థం. దీన్ని మన భారతీయ మానసిన శాస్త్రవేత్తలు ‘మూమెంటరసీ ఫ్లెజర్’ అని పిలుస్తారు. అది అప్పటికప్పుడు కలిగే క్షణికానందం లాంటిది. ఇలాంటి వారితో పాటు తమకేదో మేలు జరుగుతుందన్న ఆశిస్తున్నవారు, రాజకీయంగా మోదీని సమర్పిస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారు. మోదీ నిర్ణయం ‘మిస్‌ఫైర్’ అయితే అది మళ్లీ పేద, బడుగువర్గాల వారినే బలి తీసుకుంటుందా? అన్నదే బాధంతా. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్