
రద్దయిన కరెన్సీ నోట్లు మార్చే ముఠా అరెస్టు
విజయవాడ : రద్దయిన పాత కరెన్సీ నోట్లు మార్చే ముఠాను శనివారం టాస్క్‌ఫోర్స్, సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.23 లక్షల పాత రూ.500 నోట్లు 10 సెల్‌ఫోన్లు, రెండు మోటారు బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కె.శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్ సూర్యారావుపేట పోలీసు స్టేష¯న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్వరాజ్య మైదానం వద్ద ఎమిమిది మంది వ్యక్తులు పాత నోట్లు మార్చేందుకు బేరసారాలు చేస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీపీలు పేర్కొన్నారు.
రూ.లక్ష పాత నోట్లకు రూ.45 వేలు ఇచ్చే ఒప్పందంపై ఈ ముఠా తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని వివరించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు నోట్లు మార్పిడి చేస్తున్న 8 మందిని పట్టుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నోట్లు చెలామణి గాక పోయినా నిందితులు సంస్థల పేరుతో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా మార్పిడి చేస్తామని ఈ విధంగా డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన తోట సాయి వెంకట్, టి.కమల్‌కుమార్, చిరువెళ్ల గోపాలకృష్ణ, హరీష్, కుమార్, వెంకటేశ్వరరావు, జీవన్, విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విలేకరుల సమావేశంలో సూర్యారావుపేట సీఐ వినయ్‌మోహన్, టాస్క్‌ఫోర్స్ సీఐ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.