న్యూఢిల్లీ: ఒకవైపు పోలీసుల స్టింగ్ ఆపరేషన్ దళారులు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మరోవైపు స్కానింగ్ యంత్రాలను కూడా బురిడీ కొట్టిస్తున్న హవాలా దారులు పెద్దనోట్ల మార్పిడిలో చెలరేగిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వలపన్ని చాకచక్యంగా దళారుల ఆటకట్టిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో భారీఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న హవాలాదారులకు చెక్ పెట్టేందుకు సీబీఐ, ఈడీ, క్రైం బ్రాంచ్ అధికారులు వినియోగదారులా నటిస్తూ స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇలా కోట్ల కొద్దీ కొత్త, పాత నోట్లను సీజ్ చేస్తున్నారు.
బుధవారం డిల్లీలో ఒక హోటెల్ లో దాదాపు మూడున్నరకోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హోటెల్ లో ఆదాయ పన్ను శాఖ, క్రైం బ్రాంచ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో సుమారు3.25కోట్ల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనగదును ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్ దిగా పోలీసులు గుర్తించారు. విమానాశ్రయంలోని స్కానింగ్ యంత్రాలకు కూడా దొరక్కుండా నిపుణులతో ఒక పద్ధతిలో నోట్లను ప్యాక్ చేయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని టేపులు, తీగల సహాయంతో వీటిని పాక్ చేయించి ఎక్స్ రే మిషీన్లు కూడా కనిపెట్టకుండా తప్పించు కుంటున్నారని భావిస్తున్నారు. ఈ కేసులో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల మొబైల్ డాటాను పరిశీలిస్తున్నామని విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు మహారాష్ట్రలోని ధానే లో మంగళవారం రాత్రి 1.04కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దు అయిన పెద్ద నోట్లను 20 శాతం కమిషన్ తో మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో దాడిచేసిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి సుమారు కోటికి పైగా విలువ చేసే కొత్త రూ.2వేల నోట్లను పట్టుకున్నారు. చండీ ఘడ్ లో రూ.2.19 కోట్లను ఈడీ సీజ్ చేసింది.
బెంగళూరులో బుధవారం రూ.2.25కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చండీఘడ్ లో రెండుకోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం కొట్టనోట్లే ఉన్నట్టు అధికారులు తెలిపారు. గోవాలో 67లక్షలకొత్త కరెన్సీ నోట్లను ఈడీ పట్టుకుంది. బ్యాంకాక్ నుంచి వస్తున్న దంపతులు బేబీ డైపర్ దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 16 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో స్టింగ్ ఆపరేషన్ ద్వారా అక్రమ నగదు మార్పిడికి పాల్పడుతున్న రాకెట్టును ఛేదించిన ఈడీ అధికారులు సుమారు రూ.93 లక్షల కోత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు మధ్యవర్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.